చిరంజీవితో 'ఠాగూర్' సినిమాలోనూ, నాగార్జునతో 'మాస్' సినిమాలోనూ నటించిన జ్యోతిక, తమిళ హీరో సూర్యని పెళ్ళి చేసకున్న తర్వాత సినిమాలకు దూరమైంది. కొంత గ్యాప్ తీసుకుని ఆమె ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతోంది. రీ-ఎంట్రీలో చేసే సినిమాలు సమాజానికి ఉపయోగపడేలా ఉండేలా చూసుకుంటానని చెప్పిందామె. భర్త సపోర్ట్‌తో తాను సినిమాలు చేయగలుగుతున్నాననీ, కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నానని జ్యోతిక వెల్లడించింది. దర్శక నిర్మాతలకు కూడా సినిమాలు తీసే విషయంలో కొన్ని సూచనలు, సలహాలు ఇస్తోంది. సినిమాల్లో వెకిలితనం తగ్గించాలనీ, హీరోయిన్లంటే చాలా చిన్నచూపు సమాజంలో కలిగేలా హీరోయిన్ల పాత్రల్ని తీర్చిదిద్దడం సబబు కాదని వాపోయింది జ్యోతిక. డబుల్ మీనింగ్ డైలాగులు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంటున్నాయని జ్యోతిక అసహనం వ్యక్తం చేసింది. హీరోయిన్ల పాత్రలు వాస్తవ ప్రపంచానికి దగ్గరగా ఉండాలని ఆమె అభిప్రాయపడింది. ఎవర్నీ కించపర్చే ఉద్దేశ్యం తనకి లేదని చెబుతూ, మహిళలకు సినిమాల్లో గౌరవం పెరగాల్సిందేనని కుండబద్దలుగొట్టింది జ్యోతిక. రీ-ఎంట్రీలో '36 వయదినిలే' తర్వాత జ్యోతిక చేస్తోన్న 'మగళిర్ మట్టుమ్' త్వరలో విడుదల కానుంది. రీ ఎంట్రీలో వస్తోన్న జ్యోతిక సినిమాలన్నీ సోషల్ మెసేజ్ ఇచ్చేవే. అందులోనూ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌కే ఆమె సై అనడం మరో విశేషం.