కైకాల సత్యనారాయణ... వెండి తెర అద్భుతం. ఆయన చేయని, చేయలేని పాత్ర లేదు. నవరసాలూ ఒలికించగలరు. అందుకే నవరస నటనా సార్వభౌముడిగా నిలిచారు. ఆఖరికి దుర్యోధనుడిగానూ మెప్పించారు. `యముడి`గా యముండా.. అనిపించారు. అయితే ఆయన కోరిక ఒకటి తీరలేదు. 900 చిత్రాల మైలు రాయిని అందుకోవాలని ఆయన ఆశ. కానీ అది కుదర్లేదు. ఆయన స్కోరు 875 చిత్రాల దగ్గరే ఆగిపోయింది. మరో పాతిక చేస్తే... 900 మార్కు అందేది. నవరస నటనా సార్వభౌముడు... 900 చిత్రాలు చేస్తే... బాగుండేదని ఆయన అభిమానులూ ఆశించారు. కానీ చివర్లో ఆరోగ్యం సహకరించలేదు. ఆయన గొంతులో గాంభీర్యం బాగా తగ్గిపోయింది. బొంగురు వచ్చేసింది. దాంతో కైకాల వైపు ఎవరూ చూడలేదు.
'అరుంధతి' తరవాత కైకాల పెద్దగా సినిమాలు చేసింది లేదు. ఆయన ఇంటికే పరిమితమైపోయారు. రెండేళ్ల నుంచి పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకొంటున్నారు. కైకాల చివరి చిత్రం `దీర్ఘాయుష్‌మాన్ భవ`. ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. 87 ఏళ్ల వయసులో సెట్ కి రావడం, నటించడం కష్టమే. అందుకే....కైకాల కూడా సినిమాలకు దూరం అయ్యారు. చివరి దశలో ఆయన ఆరోగ్యం ఏమాత్రం సహకరించినా 900 మైలు రాయి అందేసేదే.