కరోనా కారణంతో థియేటర్లు మూతబడ్డాయి. కొత్త సినిమాల విడుదల ఆగిపోయింది. మళ్లీ పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో చెప్పడం కష్టం. ఈ నేపథ్యంలో ఓటీటీల వైపు ఆశగా చూస్తున్నాయి కొన్ని సినిమాలు. ఇప్పటికే.. కొన్ని సినిమాలు ఓటీటీ సంస్థలతో ఒప్పందాలు పూర్తి చేసేసుకున్నాయి. అనసూయ నటించిన `థ్యాంక్యూ బ్రదర్` సినిమా ఆహాలో విడుదల కానుంది. మే 7 నుంచి ఈ సినిమా ఆహాలో ప్రదర్శింపబడుతుంది.
ఇప్పుడు మరో సినిమా కూడా ఆహాలోకి వెళ్లిపోయిందని సమాచారం. అదే సూపర్ మచ్చీ. మెగా అల్లుడు... కల్యాణ్ దేవ్ నటించిన సినిమా ఇది. పులి వాసు దర్శకత్వం వహించారు. షూటింగ్ పూర్తయ్యింది. మంచి విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్న సమయంలో.. కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. అందుకే ఇప్పుడు ఓటీటీకి ఇచ్చేశారు. మేలోనే.. ఈసినిమా ఆహాలో ప్రదర్శితం అవుతుందని సమాచారం. రచితా రామ్, అజయ్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు