మెగా హీరో అంటే డాన్సులు, ఫైటింగులు, పంచ్ డైలాగులు కంపల్సరీ. అవి లేకపోతే మజా రాదు. మెగా ఇంటి నుంచి వచ్చిన మరో హీరో కల్యాణ్ దేవ్. తన తొలి సినిమా `విజేత`లో ఈ మూడింటికీ పెద్దగా అవకాశం రాలేదు. ఆ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. అయితే రెండో సినిమాలో మాత్రం మాస్ అంశాలు పుష్కలంగా ఉండేలా చూసుకుంటున్నాడు. తను నటించిన రెండో సినిమా `సూపర్ మచ్చీ`. రచిత రామ్ హీరోయిన్. పులి వాసు దర్శకుడు. చిత్రీకరణ పూర్తయ్యింది. దీపావళి సందర్భంగా టీజర్ విడుదలైంది.
నిమిషం పాటు సాగిన టీజర్ ఇది. ఇందులో డైలాగులేం లేవు గానీ, డాన్సులు, ఫైట్ షాట్లతో నింపేశాడు. తనలో ఓ మాస్ హీరో ఉన్నాడని కల్యాణ్ దేవ్ నిరూపించుకునే ప్రయత్నాల్లో ఉన్నాడని ఈ టీజర్ చూస్తుంటే అర్థం అవుతోంది. చివర్లో రామ్ చరణ్ ని అనుకరించేలా.. పబ్ లో స్టెప్పు కూడా వేసేశాడు. డైలాగులేం లేవు కాబట్టి, మాడ్యులేషన్ తెలీలేదు.కాకపోతే స్టైల్, గెటప్ మొత్తం మార్చేశాడు. మొత్తానికి ఇదో పక్కా కమర్షియల్ సినిమా అనేది అర్థమవుతోంది. ఈసారైనా అల్లుడికి హిట్ పడుతుందో లేదో?