కమల్ హాసన్ - శంకర్ల `భారతీయుడు 2`కి ఎన్నో బ్రేకులు, అడ్డంకులు. ఈ సినిమా షూటింగ్ చాలాసార్లు మొదలై.. ఆగిపోయింది. షూటింగ్ లో ప్రమాదం సంభవించడం, బడ్జెట్ ఎక్కువైపోయిందని నిర్మాతలు శంకర్‌పై అలగడం, కోర్టు కేసులు... వగైరా, వగైరా.. ఇలా ఎన్నో సమస్యలు. దాంతో భారతీయుడు 2 వదిలేసి, రామ్ చరణ్ సినిమా మొదలెట్టాడు శంకర్. కమల్ హాసన్ కూడా అంతే. భారతీయుడు 2 తప్ప.. మిగిలిన సినిమాలన్నీ చేస్తూనే ఉన్నాడు. దాంతో భారతీయుడు 2 సినిమా మొత్తానికి రద్దయ్యిందని, ఈ సినిమా ముందుకు వెళ్లదని అంతా తీర్మాణించేశారు.
అయితే కమల్ మాటలు ఇప్పుడు భారతీయుడు 2పై ఆశలు చిగురించేలా చేశాయి. భారతీయుడు ఆగిపోలేదని, ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లుందని కమల్ స్పష్టం చేశారు. శంకర్‌నే ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తారని, రామ్ చరణ్ సినిమా పూర్తయిన వెంటనే భారతీయుడు 2 మొదలవుతుందని, ఈ యేడాదే భారతీయుడు 2 పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నామని కమల్ క్లారిటీ ఇచ్చారు. నిజానికి శంకర్ గైర్హాజరీలో... భారతీయుడు 2 ప్రాజెక్టుకు కమల్ నే దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరిగింది. దాన్నీ కొట్టి పరేశారు కమల్. ''భారతీయుడు 2కి శంకరే దర్శకుడు. నేను హీరోని మాత్రమే. యేడాదికి రెండు మూడు సినిమాలు చేయాలనుకుంటున్నాను. దర్శకత్వం బాధ్యత కూడా నెత్తిమీద వేసుకొంటే ఆ భారం మోయడం కష్టం'' అని చెప్పుకొచ్చారు కమల్. సో.. భారతీయుడు 2 ఆగిపోలేదన్నమాట.