ఇళయతలపతి విజయ్ నటించిన మెర్సల్ చిత్రం పైన తమిళనాట బీజేపీ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వేళ ఈ అంశం పై లోకనాయకుడు కమల్ హసన్ కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
వివరాల్లోకి వెళితే, మెర్సల్ చిత్ర కథ మెడికల్ మాఫియా చుట్టూ అల్లిన కథ అవ్వడంతో తమిళనాడులోని వైద్యులు ఈ చిత్రాన్ని బహిష్కరించగా తాజాగా బీజేపీ పార్టీ కూడా ఈ జాబితాలో చేరింది. మెర్సల్ చిత్రంలో ప్రభుత్వం ఈ మధ్యనే అమలు చేసిన GST చట్టం పైన కొన్ని అభ్యంతర వ్యాఖ్యలు ఉన్నాయి అంటూ స్థానికంగా ఉన్న బీజేపీ నాయకులూ ఈ చిత్రం పైన తీవ్రంగా మండిపడుతున్నారు.
ఇదిలావుండగా లోకనాయకుడు కమల్ హసన్ ఈ అంశంలో హీరో విజయ్ కి, మెర్సల్ చిత్ర యూనిట్ కి మద్దతు ప్రకటించాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సెన్సార్ ప్రక్రియ జరిగిందని మళ్ళీ ఒకసారి రీ-సెన్సార్ చేయాలన్న డిమాండ్ సరైనది కాదు అని తెలిపాడు. అయినా వ్యవస్థ తీరు పైన సరైన రీతిలో విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది అని చెప్పుకొచ్చాడు.
ఇవ్వన్ని పక్కనపెడితే, మెర్సల్ చిత్రం మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల మోత మొగిస్తున్నది.