ధనార్జనే ధ్యేయంగా కమర్షియల్ సినిమాల కోసం వెంపర్లాడే ఈ సినీప్రపంచంలో కొందరు అందుకు భిన్నంగా వెళుతుంటారు. మంచి కథ, కంటెంట్‌ని నమ్మి అభిరుచితో మంచి సినిమాల్ని ప్రేక్షకులకు అందించాలని తపనపడుతుంటారు. అలాంటి కోవకే చెందిన నిర్మాత ఇసనాక సునీల్ రెడ్డి. 1950లలో నాటి సమాజం ఎలా ఉండేది? నాడు ఒంటరి స్త్రీలను సమాజం ఎలా చూసేది? అన్న కాన్సెప్టుతో ఆద్యంతం రక్తి కట్టించే కాన్సెప్టుతో ఆయన లివిత యూనివర్శల్ ఫిలింస్ బ్యానర్‌లో జాతీయ అవార్డు గ్రహీత నరసింహా నంది దర్శకత్వంలో తెరకెక్కించిన `కమలతో నా ప్రయాణం` విమర్శకుల ప్రశంసలందుకుంది. ఈ సినిమాకి 2013 సంవత్సరానికి గాను ఏపీ ప్రభుత్వం నంది పురస్కారాన్ని అందించింది. ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో `కమలతో నా ప్రయాణం` ఛాయాగ్రాహకులు ఎస్.మురళి మోహన్‌రెడ్డి ఉత్తమ ఛాయాగ్రాహకుడిగా నంది అవార్డు అందుకున్నారు. 1950లో నాటి గ్రామీణ వాతావరణం, పచ్చదనాన్ని తనదైన శైలిలో విజువలైజ్ చేసి ఆకట్టుకున్నారు మురళి. అందుకే ఈ పురస్కారం ఆయనకు దక్కింది.
అయితే ఇంత మంచి సినిమా తీయాలి. కమర్షియల్ సినిమాలు తీస్తున్న రోజుల్లో సామాజిక దురాచారాలపై నాటి ఆచారాలే నేపథ్యంగా దేవరకొండ బాలగంగాధర తిలక్ రచించిన నవల `ఊరి చివరి ఇల్లు`ను సినిమాగా తీయాలని దర్శకుడు భావించడం, దానిని సునీల్ రెడ్డి ప్రోత్సహించి రాజీ లేకుండా సినిమా నిర్మించడం గొప్ప విషయం.నాడు విజయం సాధించి, ఇప్పుడు నంది పురస్కారాన్ని దక్కించుకోవడంతో నిర్మాత సునీల్‌రెడ్డిని పలువురు పరిశ్రమ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. ఆ సినిమాతో శివాజీ, అర్చనకు, దర్శకుడు నరసింహానందికి చక్కని పేరు దక్కింది. ఛాయాగ్రాహకుడు మురళి మోహన్‌రెడ్డికి మంచి పేరొచ్చిందని పలువురు ప్రశంసించడం ఆనందంగా ఉందని అంటున్నారు నిర్మాత సునీల్ రెడ్డి. ఈ సందర్భంగా `కమలతో నా ప్రయాణం` సినిమాకి పురస్కారం దక్కేందుకు దోహదపడిన `నంది` అవార్డుల కమిటీకి, ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.