సినిమా కోసం కంగనా రనౌత్ ఎంతలా కష్టపడడానికైనా సిద్ధమే. ఆ కష్టమంతా, తెరపై కనిపిస్తుంటుంది. అందుకే ఆమె బాలీవుడ్ క్వీన్ అయ్యింది. ఎన్నో మంచి పాత్రలు ఆమె కోసం సిద్ధమవుతూ ఉంటాయి. ప్రస్తుతం కంగనా ప్రధాన పాత్రలో 'తలైవి' చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఎ.ఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుండి తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు.
గత కొన్ని నెలలుగా ఈ సినిమా కోసం కంగనా కసరత్తులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ కసరత్తుల్లో భాగంగా కంగనా ఎలా మారిపోయిందో చూశారా? ఈ పోస్టర్ చూస్తే తెలుస్తుంది. నిండైన పచ్చ రంగు చీరకట్టులో అభిమానులకు అభివాదం చేస్తున్నట్లుగా ఉన్న అమ్మ జయలలిత పోస్టర్ ఇది. పోస్టర్‌లో ఉన్నది ఎవరు.? అని చెబితే కానీ, గుర్తు పట్టలేనంతగా కంగనా మారిపోయింది. అచ్చు అమ్మలానే కనిపిస్తోంది. కంగనా మేకోవర్‌కి ఆశ్చర్యపోవడమే అందరి వంతవుతోంది. పోస్టర్ దిగువ భాగాన డిజైన్ చేసిన కంగనా మోడ్రన్ గెటప్ ఆమె సినీ ప్రస్ధానానికి సంబంధించిన హింట్‌గా భావించాలి.
అంటే, 'తలైవి' సినిమా ద్వారా జయలలిత సినీ ప్రస్థానాన్నీ, రాజకీయ ప్రస్థానాన్నీ చెప్పబోతున్నారని ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ ద్వారా అర్ధమవుతోంది. 'ఈ లెజెండ్ మనందరికీ తెలుసు. కానీ, ఆమె కథ తెలియజేయాల్సి ఉంది..' అంటూ పోస్టర్‌పై పేర్కొన్న చిత్ర యూనిట్, వచ్చే ఏడాది జూన్ 20న సినిమా రిలీజ్ డేట్ అని ఈ సందర్భంగా ప్రకటించింది.