బిగ్ బాస్ 4 సీజన్‌లో అసలైన డ్రామా మొదలైపోయింది. తొలి వారం... సూర్య కిరణ్ ఎలిమినేట్ అయ్యాడు. ఇప్పుడు కరాటే కల్యాణీ బయటకు వచ్చేసింది. అయితే.. బయటకు వచ్చాక.. కల్యాణీ చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తనని వెన్నుపోటు పొడిచారని, ఓటింగ్ విషయంలోనూ మోసం జరిగిందని కల్యాణీ ఆవేదన వ్యక్తం చేసింది. తనకి ఓట్ చేయాలని చాలామంది ప్రయత్నించారని, కానీ.. తనకు కేటాయించిన నెంబర్ పనిచేయలేదని, తనకి ఓటేస్తే మరొకరికి పడిపోయిందని అందుకు ఆధారాలు తన దగ్గర ఉన్నాయంటోంది కల్యాణీ.
బిగ్ బాస్ హౌస్‌లోనూ తనని వెన్నుపోటు పొడిచారని, కానీ తనని మోసం చేసిన వాళ్ల పేర్లు బయటకు చెప్పనని అంటోంది. ''బిగ్ బాస్ హౌస్ అన్నది ఓ జీవిత కాల జ్ఞాపకం. జీవితంలో ఒక్కసారే ఇలాంటి అవకాశం వస్తుంది. అదెప్పటికీ మర్చిపోలేను. బయటకు వచ్చాక నాకు వస్తున్న ఫోన్ కాల్స్ చూస్తుంటే, నన్ను ఇంతమంది అభిమానిస్తున్నారా అనిపిస్తోంది. అంతకంటే నేను కోరుకునేది ఏం లేదు. నాపై వచ్చిన మీమ్స్ చూశాను. మరో సూర్యకాంతం వచ్చిందంటూ పొగుడుతున్నారు.
బిగ్ బాస్ హౌస్‌లో అందరిలా నేను నటించలేదు. డ్రామా పండించలేదు. అందుకే రెండో వారమే వచ్చేశా'' అంటోంది కల్యాణీ.