ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మరణం సినీ ప్రపంచానికే తీరని లోటు. ఆయన మృతి పట్ల పలువురు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియ జేశారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఆయన మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మ శాంతించాలని కోరుకున్నారు. తెలంగాణా ముఖ్యమంత్రి ఆయన లేని లోటును ఎవ్వరూ భర్తీ చేయలేరని అన్నారు. ప్రభుత్వం తరపున ఆథికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయమని ఆదేశించారు. మెగాస్టార్ చిరంజీవి విదేశీ పర్యటనలో ఉన్నందున ఆయన మరణ వార్త విని తన సంతాప సందేశాన్ని తెలియజేశారు. దాసరితో ఆయనకున్న అనుబంధం ప్రత్యేకమైందనీ, ఆయన తమ కుటుంబానికి అత్యంత సన్నిహితులు అని చిరు తెలిపారు. ఇటీవలే తన చేతుల మీదుగా అల్లు రామలింగయ్య స్మారక పురస్కారాన్ని అందించారు. ఇంతలోనే ఇలా జరగడం చాలా బాధాకరం అని చిరంజీవి దాసరితో తనకున్న అనుబంధాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నారు. రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దాసరి మృతిపై స్పందిస్తూ..'మీ కుర్చీ మీ కోసం ఎప్పటికీ ఎదురు చూస్తుందనీ.. మీరు మళ్లీ పుట్టండి..' అని ట్వీట్ చేశారు. మోహన్‌బాబును ఆయన మరణ వార్త విన్న దగ్గర్నుంచీ బోరున విలపిస్తూనే ఉన్నారు. ఆయన్ని ఆపడం ఎవ్వరి వల్లా కావడం లేదు.