చిత్రసీమపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. కరెంట్ ఛార్జీల రద్దు, జీఎస్‌టీలో చిన్న సినిమాలకు మినహాయింపు.. ఇలా పలు రకాల కీలకమైన నిర్ణయాలు తీసుకుని, టాలీవుడ్ కి పునరుత్తేజం కలిగించే ప్రయత్నం చేశారు. కరోనా వల్ల టాలీవుడ్ కుదేలైపోయిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు చిత్రసీమని గాడిన పెట్టే ప్రయత్నాల్లో భాగంగా కొన్ని వరాలు ప్రకటించారు.
జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లకు ఇతర వ్యాపార సంస్థలతో పాటు ఉండే హెచ్ టీ, ఎల్టీ కేటగిరి కనెక్షన్స్‌కు సంబంధించి విద్యుత్ కనీస డిమాండ్ చార్జీలను ప్రభుత్వం రద్దు చేసింది. 10 కోట్లలోపు బడ్జెట్‌తో నిర్మించే సినిమాలకు రాష్ట్ర జీఎస్టీ రీఎంబర్స్‌మెంట్‌ను సహాయంగా అందించి చితన్న పరిశ్రమలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తెలంగాణలో అన్ని రకాల సినిమా థియేటర్స్‌లో ప్రదర్శనలను (షోలను) పెంచుకునేందుకు అనుమతి ఇస్తాం. మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీలలో ఉన్న విధంగా టిక్కెట్ల ధరలను సవరించుకునే వెసులుబాటును కల్పిస్తామన్నారు కేసీఆర్.