కొంతమంది కథానాయికలు ఎన్ని ప్రయోగాలు చేయడానికైనా రెడీనే. కానీ గర్భవతిగా కనిపించమంటే మాత్రం జంకుతారు. తమ గ్లామర్ రూల్స్‌కి విరుద్ధం అనుకుంటారో ఏమో.. ఆ తరహా పాత్రలు చేయడానికి ఒప్పుకోరు. ఇంకొంతమంది మాత్రం... దేనికైనా సై అంటారు. కీర్తి సురేష్ కూడా అదే టైపు. త్వరలోనే తను గర్భవతిగా కనిపించబోతోందట. ఇటీవల హిందీలో తెరకెక్కిన 'మిమి' ఓటీటీలో విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. కృతి సనన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు.
ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకోసం కీర్తి సురేష్ ని సంప్రదించార్ట. తను కూడా ఈసినిమాలో నటించడానికి పచ్చజెండా ఊపేసిందని సమాచారం. ఇది కథానాయికా ప్రాధాన్యం ఉన్న చిత్రం కావడంతో కీర్తి... ఏమాత్రం ఆలోచించలేదు. అయితే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కీర్తికి పెద్దగా కలసి రాలేదు. 'పెంగ్విన్', 'మిస్ ఇండియా' తీవ్రంగా నిరాశపరిచాయి. అయినా సరే, అలాంటి కథలనే ఎందుకు ఎంచుకుంటోందో?