టాలీవుడ్ లో ఉన్న సక్సెస్ఫుల్ డైరెక్టర్ లలో కొరటాల శివ ఒకరు. సామాజిక అంశాలను కమర్షియల్ ఎలిమెంట్స్ తో మిక్స్ చేసి ప్రేక్షకులను మెప్పించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. మరీ క్లాసులు పీకినట్టు కాకుండా ప్రేక్షకులకు ఆయన చెప్పదలుచుకున్నది సూటిగా చెప్తూనే హీరోయిజం, పాటలు ఫైట్లకు లోటు లేకుండా చూసుకుంటారు. దీంతో ఆయన సినిమాలకు భారీగా డిమాండ్ ఉంది. నిన్న #AA21 సినిమా ప్రకటన రావడం ఆలస్యం.. ఈ సినిమా కోసం కొరటాల ఎటువంటి కాన్సెప్ట్ ఎంచుకున్నారోనని ఆసక్తికర చర్చ మొదలైంది.
తాజా సమాచారం ప్రకారం కొరటాల శివ ఈ సారి కూడా ఒక ప్రధానమైన సామాజిక అంశం పై కథ రాసుకున్నారని అంటున్నారు. ఈ సినిమాలో సహజవనరులను దోచుకొని కాలుష్యం కలుగజేసే కంపెనీలపై హీరో చేసే పోరాటం ప్రధానంగా ఉంటుందని టాక్. హీరో ఒక రీసెర్చ్ స్టూడెంట్ పాత్రలో నటిస్తున్నారట. ఈ మధ్య జరిగిన గ్యాస్ లీక్ సంఘటనల ఆధారంగానే ఈ కథ రెడీ చేశారని అంటున్నారు. సినిమాలో అల్లు అర్జున్ పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుందని, కార్పొరేట్ కంపెనీలు చేసే తప్పిదాల వల్ల ప్రజలకు, పర్యావరణానికి నష్టం కలగకుండా చూడాలంటూ హీరో పోరాడతారని సమాచారం.