నవతరం దర్శకుల ఆలోచనా తీరు మారిపోయింది. కేవలం క్రియేటీవ్ విషయాలలోనే కాదు, బిజినెస్ విషయాలలోనూ తమ జోక్యం ఉండాలని భావిస్తున్నారు. సినిమాలకు పారితోషికం తీసుకోవడం తో పాటు.. లాభాల్లో వాటా కూడా అడుగుతున్నారు. పారితోషికాన్ని వాటాగా మలచుకున్న దర్శకులూ ఉన్నారు. రాజమౌళికి పారితోషికం కంటే, లాభాల్లో వాటానే ఎక్కువట. త్రివిక్రమ్ కూడా అంతే. హారిక హాసినిలో వరుసగా సినిమాలు చేస్తున్నాడు త్రివిక్రమ్. తనకు పారితోషికం బదులు లాభాల్లో వాటా అందుతోందని టాక్.
ఇప్పుడు కొరటాల శివ కూడా అంతేనట. టాలీవుడ్ లోని అగ్ర దర్శకుల జాబితాలో కొరటాల శివ పేరు తప్పకుండా ఉంటుంది. ఆయన పారితోషికం కూడా ఎక్కువే. అయితే ఇప్పుడు నిర్మాతగానూ కొరటాల మరారని టాక్. కొరటాల తదుపరి సినిమా అల్లు అర్జున్‌తోనే. ఈ సినిమాతో తన స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని నిర్మాతగా మారారు. నిజానికి పేరుకే ఆయన నిర్మాతట. డబ్బంతా... కొరటాల శివదే అని టాక్. అంత కాకపోయినా.. కొంతైనా కొరటాల పెట్టుబడి పెట్టుంటారని, తెర వెనుక ఈ సినిమాకి నిర్మాత కొరటాలే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కాదు.. కొరటాల కొన్ని వెబ్ సిరీస్‌లకూ రంగం సిద్ధం చేస్తున్నాడట. వాటికి మాత్రం నిర్మాతగా కొరటాల పేరు కనిపిస్తుందని చెబుతున్నారు. మొత్తానికి.. కొరటాలలో బిజినెస్ యాంగిల్ కూడా మొదలైపోయిందన్నమాట.