మనకున్న సృజనాత్మక దర్శకులలో క్రిష్ ఒకరు. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్, కంచె.. ఇలా ఆయన విభిన్నమైన సినిమాలు తీశారు. ప్రయోగాలు చేశారు. ఇప్పుడు మరోసారి కమర్షియల్ ఫార్మెట్ కు దూరంగా ఓ ప్రయోగాత్మక చిత్రం చేయాలని ఫిక్సయ్యారు. సుప్రసిద్ధ.. కన్యాశుల్కం నాటకాన్ని ఆయన తెరపైకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. గురజాడ అప్పారావు రచించిన ఈ నాటకం అత్యంత ప్రజాదరణ పొందింది. ఇప్పటికీ ఏదో ఓ చోట ఈ నాటకం గురించి జనం మాట్లాడుకుంటూనే ఉంటారు.
ఇప్పుడు ఈ నాటకాన్ని క్రిష్ సినిమాగా తీయబోతున్నార్ట.
కన్యాశుల్కం అనగానే మధురవాణి పాత్ర గుర్తుకొస్తుంది. ఆమె ఓ వేశ్య. ఈ నాటకానికి ఆమే కీలకం. ఇప్పుడు ఆ పాత్ర కోసం అనసూయ భరద్వాజ్ పేరు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అనసూయ ఓకే అంటే.. ఈ ప్రాజెక్టు వెంటనే పట్టాలెక్కేస్తుంది. అయితే ఈ సినిమా ఓటీటీ కోసమా, సినిమా కోసమా? అనేది తేలాల్సివుంది. ఇది వరకు క్రిష్ కొండపొలం నవలని సినిమాగా రూపొందించాడు. కానీ అది కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి.