క్రిష్.. క్రియేటివిటీ గురించి అందరికీ తెలుసు. కమర్షియల్ గా అస్సలు ఆలోచించడు. విభిన్నమైన కథల్ని ఎంచుకుంటాడు. క్రిష్ గొప్ప సినిమా తీశాడన్న పేరొస్తుంది తప్ప, తన సినిమాలకు అదిరిపోయే వసూళ్లు రావు. క్రిష్ సినిమాల్లో .. గౌతమి పుత్ర శాతకర్ణి.. ఒక్కటే బాగా డబ్బులు తీసుకొచ్చింది. అందులోనూ స్టార్ హీరో ఉండడం కలిసొచ్చింది. పెద్ద సినిమాలు తీస్తూనే, చిన్న చిన్న ప్రయోగాలు చేయడం, చిన్న కథలతో సినిమాలు తీయడం క్రిష్‌కి అలవాటు.
క్రిష్ చేతిలో పవన్ `హరి హర వీరమల్లు` ఉంది. అయితే.. ఆ సినిమాకి కాస్త గ్యాప్ రావడంతో.. 'కొండ పొలం' నవలని సినిమాగా తీసేశాడు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నాడు. 'కన్యాశుల్కం' అనే సుప్రసిద్ధ నాటికను ఆయన వెండి తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు. మధురవాణి పాత్రకు ఆల్రెడీ అనసూయని ఎంచుకొన్నట్టు టాక్ నడుస్తోంది. ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహిస్తారా, లేదా? అనేది తెలియాల్సివుంది. అయితే.. 'కొండ పొలం' తీస్తున్నప్పుడే పవన్ కాస్త సీరియస్ అయ్యాడని సమాచారం.
''చేతిలో పెద్ద సినిమా ఉండగా.. ఇలాంటి చిన్న సినిమాలు ఎందుకు'' అని అడిగినట్టు అప్పట్లో చెప్పుకొన్నారు. కానీ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ సినిమా కావడంతో పవన్ ఏమీ అనలేకపోయాడని టాక్. ఇప్పుడు కూడా అంతే. 'హరి హర వీరమల్లు' ఇంకా పూర్తి కాలేదు. ఆ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. మరోవైపు మరో స్క్రిప్టులో క్రిష్ తలమునకలు అవ్వడం పవన్‌కి నచ్చడం లేదట. అందులోనూ పాయింట్ ఉంది. పెద్ద సినిమా అంటే బోలెడంత అటెన్షన్ ఉండాలి. దానిపై అభిమానులు పెట్టుకొనే అంచనాల్ని అందుకోవడం సామాన్యమైన విషయం కాదు. అలాంటప్పుడు ఇలాంటి ప్రయోగాలెందుకు? ముందు హరి హర వీరమల్లుని ముగించి, అప్పుడు క్రిష్ ఎన్ని సినిమాలు తీసుకొన్నా.. ఎవరికీ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ఇదే విషయంపై హాట్ హాట్ గా చర్చించుకుంటున్నారు.