కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సినిమా `గోవిందుడు అందరివాడేలే`. ఈ సినిమాకి బండ్ల గణేష్ నిర్మాత. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో కృష్ణవంశీకీ, బండ్ల గణేష్‌కి మధ్య గొడవలు జరిగాయన్న టాక్ వినిపించింది. సినిమా కోసం అనుకున్నదానికంటే ఎక్కువ ఖర్చు పెట్టారని, బడ్జెట్ ఫెయిల్యూర్ వల్ల నష్టాలొచ్చాయని, దీనిపై బండ్ల కృష్ణవంశీపై సీరియస్ అయ్యాడని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. కానీ ఈ విషయంపై అటు బండ్ల గణేష్ గానీ, ఇటు కృష్ణవంశీ గానీ మాట్లాడలేదు. దీనిపై ఎట్టకేలకు స్పందించాడు బండ్ల గణేష్.
''దర్శకుడు, నిర్మాత అన్నాక అలాంటి గొడవలు సహజం. మేం ఎన్ని గొడవలు పడినా ఓ మంచి సినిమా ఇవ్వడానికే. `ఎన్నిరోజులు తీస్తారు సార్` అని ఓ సందర్భంలో నేను అనేసరికి.. ఆయన కాస్త నొచ్చుకున్నారు. అంతే తప్ప... వేరే కారణాలేం లేవు. కృష్ణవంశీ గొపప్ క్రియేటీవ్ దర్శకుడు. ఆయనతో మళ్లీ ఓ సినిమా తీస్తా. ఈమధ్య వెళ్లి కలిశాను. `రంగమార్తాండ` తరవాత.. మా కాంబినేషన్ లో మరో సినిమా ఉండొచ్చు'' అని చెప్పుకొచ్చాడు గణేష్.