ఫేస్ బుక్, ట్విట్టర్ నిండా... రంగమార్తాండ కబుర్లే. ఈ సినిమా అద్భుతంగా ఉందని, కృష్ణవంశీ ఈ సినిమాతో తన తడాఖా మరోసారి చూపించబోతున్నారంటూ సినీ ప్రేమికులు మెచ్చుకొంటూ పోస్టులు పెడుతున్నారు. ఈనెల 22న ఈ సినిమా విడుదల కాబోతోంది. అయితే విడుదలకు ముందే.. కొన్ని ప్రీమియర్ షోలు వేశారు కృష్ణవంశీ. మీడియాకు ముందే సినిమా చూపించేశారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఓ షో వేశారు. దర్శకులకు, నిర్మాతలకు, అడిగిన వారికీ, అడగని వారికీ షోల మీద షోలు వేస్తూనే ఉన్నారు. అందరి నుంచీ మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాని వాళ్లంతా ఆకాశానికి మోసేస్తున్నారు.
ప్రీమియర్ షోలు ఇన్ని వేసిన సినిమా ఈమధ్య కాలంలో మరోటి లేదేమో..? కృష్ణవంశీ కేవలం ప్రీమియర్ షోల మీద ఫోకస్ చేయడానికి ఓ బలమైన కారణం ఉంది. ఈ సినిమాని అష్టకష్టాలు పడి పూర్తి చేశారు వంశీ. సినిమా పూర్తయ్యేసరికి, పబ్లిసిటీ చేసుకోవడానికి డబ్బులు మిగల్లేదు. ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, ప్రెస్ మీట్లూ నిర్వహించేందుకు నిర్మాతలు ఆసక్తి చూపించడం లేదు. దాంతో.. ప్రీమియర్ షోల పై ఆధారపడ్డారు వంశీ. అయితే ఈ ప్రయత్నం ఫలించేటట్టే కనిపిస్తోంది. మౌత్ టాక్‌ల వల్ల... సినిమాలు హిట్టయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మొన్నామధ్య వచ్చిన బలగం కీ ఇదే సూత్రం వర్తిస్తుంది. ఈ సినిమా కేవలం మౌత్ టాక్ వల్లే... వసూళ్లు తెచ్చుకోగలిగింది. రంగమార్తండకీ అలానే టికెట్లు తెగుతాయా? కృష్ణవంశీ కష్టం ఫలిస్తుందా? అనేది తెలియాలంటే ఈనెల 22 వరకూ ఆగాల్సిందే.