చిత్రం: లాల్ సలామ్
నటీనటులు: రజినీకాంత్, విష్ణు విశాల్, విక్రాంత్
దర్శకత్వం: ఐశ్వర్య రజినీకాంత్
నిర్మాతలు: సుభాస్కరన్ అల్లిరాజా
సంగీతం: ఎ. ఆర్. రెహమాన్
ఛాయాగ్రహణం: విష్ణు రంగస్వామి
కూర్పు: బి. ప్రవీణ్ భాస్కర్
బ్యానర్స్: లైకా ప్రొడక్షన్స్
విడుదల తేదీ: 9 ఫిబ్రవరి 2024
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 2/5
పండిత పుత్రః.. అనే ఓ నానుడి తెలుగులో బాగా ఫేమస్. సినిమా రంగానికీ అది వర్తిస్తుంది. స్టార్ ఇంటి నుంచి వచ్చిన వారసులు 'సన్ స్ట్రోక్', 'డాటర్ స్ట్రోక్' తీసుకొస్తుంటారు. రజనీ కుటుంబం నుంచి తెరపైకి వారసులు ఎవరూ రాలేదు. అయితే తెర వెనుక ఐశ్వర్య రజనీకాంత్ తనని తాను నిరూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆమె దర్శకత్వం వహించిన 'కొచ్చాడియన్' బాక్సాఫీసు దగ్గర ఏమాత్రం మెప్పించలేదు. ఆ దెబ్బకు ఆమె కొన్నాళ్లు మెగాఫోన్‌కు దూరమయ్యారు. ఇప్పుడు 'లాల్ సలామ్'తో మరో ప్రయత్నం చేశారు. రజనీకాంత్ ఓ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా ఎలా వుంది? 'జైలర్'తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన సూపర్ స్టార్ మరో విజయాన్ని అందుకొన్నాడా? రజనీ కుమార్తె తొలి హిట్ కొట్టిందా..?
కథ:
అనగనగా ఓ ఊరు. హిందూ, ముస్లింలు కలసి కట్టుగా ఉంటారు. అక్కడి యువతకు క్రికెట్ అంటే మక్కువ. త్రి స్టార్, ఎంసీసీ అనే రెండు జట్లుగా విడిపోయి క్రికెట్ ఆడుతుంటారు. రాను రాను ఆ పోటీ ప్రతిష్టాత్మకంగా మారిపోతుంది. చివరికి హిందూ, ముస్లిం గొడవలకు దారి తీస్తుంది. రెండు వర్గాల్లో ఉన్న గురు (విష్ణు విశాల్) షంషుద్దీన్ (విక్రాంత్) నిత్యం ఘర్షణ పడుతుంటారు. వీరి వల్ల ఆ ఊర్లో ఎలాంటి సమస్యలు వచ్చాయి..? మొయినుద్దీన్ (రజనీకాంత్) ఎవరు? ముంబైలో ఉంటున్న మొయినుద్దీన్‌కీ ఈ ఊరికీ ఉన్న లింకేంటి? ఈ మతకల్లోలాలు ఎలా తగ్గాయి? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
రజనీ కుమార్తె ఐశ్వర్య ఓ సినిమా తీస్తోందంటే, అందులో రజనీ నటిస్తున్నాడంటే కచ్చితంగా ఆ సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. తొలి అడుగులో తడబడిన ఐశ్వర్య ఈసారి తప్పు చేయడానికి ఛాన్సు లేదు. ఆమె కాస్త పకడ్బందీగా స్క్రిప్టు రాసుకోవాల్సిందే. అయితే.. అలాంటి ప్రయత్నాలేం జరగలేదని సినిమా మొదలైన కాసేపటికే అర్థమైపోతుంది. ఈ కథలో గానీ, కథనంలో గానీ ఎలాంటి కొత్తదనం లేదు. ప్రారంభ సన్నివేశాలు కథపై ఆసక్తి పెంచుతాయి. అయితే అది క్రమంగా అడుగంటుంది. గురు ఎందుకు జైలుకెళ్లాడు? అసలు షంషుద్దీన్‌తో తనకున్న గొడవేంటి? అనే విషయాల్ని ఇంట్రవెల్ వరకూ దాచి పెట్టారు. మధ్యలో ఊరి జాతర, అక్కడ రథం గొడవ వైపు కథ యూ టర్న్ తీసుకొంటుంది. రథం కోసం గురు క్రికెట్ మ్యాచ్‌లు ఆడడం, డబ్బులు సంపాదించడం.. దీనిపై సెకండాఫ్ లో సగం సినిమా నడిచిపోతుంది. చివర్లో హిందూ - ముస్లిం భాయ్ భాయ్ అనుకొని, అంతా కలిసిపోవడంతో కథకు శుభం కార్డు పడుతుంది.
అసలు ఈ సినిమాతో దర్శకురాలు ఏం చెప్పాలనుకొన్నదో స్పష్టత లేదు. మత కల్లోలాలు వద్దని చెప్పాలనుకొంటే, ఆ తరహా కథలు చాలా వచ్చాయి. ట్రీట్మెంట్ కొత్తగా ఉందా అంటే అదీ లేదు. క్రికెట్ కోసం కొన్ని సీన్లు, రధం కోసం ఇంకొన్ని సీన్లు, ముంబైలో రజనీ లైఫ్ స్టైల్ గురించి చెప్పడానికి మరికొన్ని సీన్లు ఖర్చయిపోతాయి. గురుకి ఓ ప్రేమకథ ఉంది. హీరోయిన్ తో ఓ పాట కూడా పెట్టారు. కానీ అది మధ్యలోనే ఆగిపోతుంది. ఇలా సగం సగం వండిన విషయాలు ఈ కథలో చాలానే ఉన్నాయి. క్రికెట్ ఆడుతున్నప్పుడు ప్రేక్షకుడు ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వాలి. లేదంటే టీవీలో అయిపోయిన మ్యాచ్ చూస్తున్న ఫీలింగే తప్ప ఎలాంటి ఉత్కంఠత కలగదు. ఈ సినిమా విషయంలో అదే జరిగింది. కథలోని పాయింట్ తో ప్రేక్షకులు కనెక్ట్ కావడం కష్టం. దాంతో ఏ పాత్రతోనూ ట్రావెల్ చేయలేకపోతాడు. జాతర నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు పూర్తిగా తమిళ సినిమాల స్టైల్ లో సాగుతాయి. దాంతో తెలుగు ఆడియన్ పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోతాడు. క్లైమాక్స్ కు అరగంట ముందే సినిమా అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. చివర్లో హిందూ - ముస్లింల సమైక్యత చూపించినా.. అప్పటికే నీరసం ఆవహించేస్తుంది.
నటీనటుల ప్రతిభ:
రజనీ వయసుకు, అనుభవానికీ తగిన పాత్ర ఇది. ముస్లిం గెటప్పులో హుందాగా ఉన్నాడు. అయితే రజనీ స్టైల్ మిస్సయ్యింది. ప్రతీ సినిమాలోనూ రజనీ స్టైల్ కోరుకోవడం కూడా తప్పే. అందుకే ఈ సినిమాని మినహాయించుకోవాలి. విష్ణు విశాల్ స్ర్రీన్ ప్రజెన్స్ ఆకట్టుకొంటుంది. విక్రాంత్ కూడా ఓకే. జీవిత ఓ కీలక పాత్ర పోషించింది. ఆమె నటనలో సాధారణంగా తమిళ సినిమాల్లో తల్లులు చేసే ఓవర్ మెలోడ్రామా కనిపిస్తుంది. ఎందుకో ఈ పాత్ర ఆమెకు సూటవ్వలేదనిపిస్తుంది. నిరోషా చాలా రోజుల తరవాత దర్శనమిచ్చింది. కపిల్ దేవ్ అతిధి పాత్రలో మెరిశారు. ఆయన వల్ల ఈ సినిమాకు వచ్చిన అదనపు ప్రయోజనం అంటూ ఏం లేదు.
సాంకేతిక వర్గం:
రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో పాటలు ఆయన స్థాయిలో లేకపోవడం శోచనీయం. నేపధ్య సంగీతంతోనూ ఆయన మార్క్ వేయలేకపోయారు. పల్లెవాతావణాన్ని ఫొటోగ్రఫీ ప్రతిబింబించింది. ఎడిటింగ్ మరింత షార్ప్‌గా ఉండాలి. డైలాగుల్లో పాత వాసనలు ఎక్కువ కనిపించాయి. దర్శకురాలిగా, కథకురాలిగా ఐశ్వర్య మరోసారి విఫలం అయ్యింది.
ప్లస్ పాయింట్స్
రజనీకాంత్
మైనస్ పాయింట్స్
కథ
కథనం
సంగీతం
ఫైనల్ వర్డిక్ట్: నీకో దండం!