జీరో గ్రావిటీ వాతావరణంలో విజువల్ వండర్‌గా రూపొందుతోన్న చిత్రం 'అంతరిక్షం'. వరుణ్‌తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కథా, కమామిషు ఏంటనే విషయంపై చిన్న క్లూ చిత్ర యూనిట్ రివీల్ చేసింది. కమ్యూనికేషన్ వ్యవస్థలో వచ్చిన పెను మార్పుల కారణంగా దేశాల మధ్య దూరం తగ్గిపోయింది. ప్రపంచం మన కబంధ హస్తాల్లో ఒదిగిపోతోంది. అయితే అలాంటి కమ్యూనికేషన్ వ్యవస్థ అంతా దెబ్బ తినే పరిస్థితే వస్తే.? ఊహించడమే కష్టం కదా. ఆ పరిస్థితిని మెయిన్ పాయింట్‌గా తీసుకుని తెరకెక్కించిన చిత్రమే 'అంతరిక్షం'.
అంతరిక్షంలోని ఓ 'మిరా' అనే శాటిలైట్ అనుకోకుండా దారి తప్పడంతో ప్రపంచంలోని కమ్యూనికేషన్ వ్యవస్థ అంతా దెబ్బ తినే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకు దేవ్ అనే ఆస్ట్రనాట్ రంగంలోకి దిగుతాడు. ఆ శాటిలైట్‌ని తిరిగి కక్ష్యలో పెట్టేందుకు దేవ్ ఏం చేశాడు.? ఆ ప్రయాణంలో దేవ్ ఎదుర్కొన్న విపత్కర పరిస్థితులేంటీ.? అనే అంశంపై ఈ సినిమా రూపొందుతోంది. ముద్దుగుమ్మ అదితీరావ్ హైదరీ కూడా ఆస్ట్రనాట్ పాత్రలోనే కనిపించనుందీ సినిమాలో. మరో భామ లావణ్య త్రిపాఠి ఇంకో హీరోయిన్‌గా నటిస్తోంది.
సినిమా సినిమాకీ విలక్షణ చూపించాలని తపన పడే మెగా హీరో వరుణ్‌తేజ్. 'కంచె' సినిమాలో సైనికుడిగా కనిపించి, బోర్డర్‌లో తన సత్తా ఏంటో చూపించాడు. ఇప్పుడు అంతరిక్షంలోకి అడుగుపెట్టాడు. చూస్తున్న ప్రతీ ప్రేక్షకుడూ మనం అంతరిక్షంలోనే ఉన్నామా అనే ఫీల్‌నీ, సరికొత్త థ్రిల్‌నీ కలిగించనుందట 'అంతరిక్షం' మూవీ. క్రిష్ సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది. ఆల్రెడీ సినిమాని వీక్షించిన సెన్సార్ బోర్డ్ సభ్యులు చిత్ర యూనిట్‌ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. డిశంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోయే 'అంతరిక్షం' మూవీ అంచనాల్ని అందుకుంటుందో లేదో చూడాలి మరి.