'గౌతమి పుత్ర శాతకర్ణి' తెలుగువారి సినిమా. తెలుగు చక్రవర్తి శాతకర్ణి చరిత్ర ఇది. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా శాతకర్ణి గురించి చెప్పుకోవచ్చు. దురదృష్టవశాత్తూ శాతకర్ణికి సంబంధించిన చరిత్ర పూర్తిస్థాయిలో అందుబాటులోకి లేకుండా పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఎంతో రీసెర్చ్ చేసి క్రిష్ - బాలకృష్ణ టీమ్ 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ ప్రయత్నానికి తెలుగు రాష్ట్రాలు సానుకూలంగా స్పందించాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సినిమాకి పన్ను రాయితీని ప్రకటించి తమ పెద్ద మనసును చాటుకున్నారు. అయితే, ఈ పన్ను రాయితీలపై కొందరు న్యాయవాదులు న్యాయపోరాటం మొదలు పెట్టారు. టేబుల్ ప్రాఫిట్ పొందడమే ఈ సినిమా చేసిన నేరమట. కమర్షియల్ ఆలోచనలు చేయకుండా ఇంత పెద్ద యజ్ఞాన్ని చేపట్టినందుకు ఎవరైనాసరే 'శాతకర్ణి' టీమ్‌ని అభినందించాలి. వారి ప్రయత్నానికి తెలుగు రాష్ట్రాలు ఊరకనే సహకరించలేదు పన్ను రాయితీ ఇవ్వడంలో. ఇది తెలుగు సినిమా, తెలుగు చరిత్రను తెరకెక్కించిన సినిమా. తెలుగువారందరూ చూడదగ్గ సినిమా కనుకనే ఈ పన్నురాయితీ. వివాదాలు సృష్టించేవారెవరైనాసరే తెలుగు సినిమా ఖ్యాతి పెరగడాన్ని అభిలషించాలి. అభిలషిస్తారని ఆశిద్దాం.