రీమేకులు సేఫ్ జర్నీ అనుకొంటారు హీరోలు. కథల కోసం పెద్దగా అన్వేషించాల్సిన పనిలేదు. పైగా.. ఆల్రెడీ ఓ భాషలో హిట్టయిపోయిన కథ దొరుకుతుంది. మినిమం గ్యారెంటీ ఉంటుంది. ఎలా తీయాలో.. ఏం తీయాలో స్పష్టంగా తెలుసు. అందుకే రీమేకులపై మోజు ఎక్కువ. కాకపోతే.. ఇప్పుడు రీమేకులకు కాలం చెల్లినట్టే అనిపిస్తోంది. ఎందుకంటే... అన్ని భాషల సినిమాలూ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేశాయి. డబ్బింగ్ వెర్షన్లూ దొరుకుతున్నాయి. భాషతో పనిలేకుండా, ఆ భాష రాకపోయినా సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఇలాంటి పరిస్థితుల్లో రీమేకులు చేసి, పాత కథల్ని సినిమాలుగా తీస్తే ఆదరించడానికి ప్రేక్షకులు రెడీగా లేరన్న విషయం అర్థమవుతూనే ఉంది. దానికి గాడ్ ఫాదర్ సినిమాకి ఉన్న బజ్ ప్రత్యక్ష సాక్ష్యం.
చిరంజీవి సినిమా ఇది. ఆయన సినిమా వస్తోందంటే ఎంత క్రేజ్..? ఎంత హడావుడీ? ఎంత హంగామా ఉండేది..? అవేం.. గాడ్ ఫాదర్ కి కనిపించడం లేదు. టీజర్, ట్రైలర్ వచ్చినా బజ్ ఏర్పడలేదు. దానికి కారణం... రీమేక్ అవ్వడమే అనేది విశ్లేషకులు మాట. ఈ సినిమా లూసీఫర్‌కి రీమేక్. మలయాళంలో సూపర్ హిట్టయినప్పుడే తెలుగువాళ్లూ ఈ సినిమా చూశారు. ఆ తరవాత డబ్బింగ్ రూపంలో వచ్చింది. ఆ వెర్షన్ కూడా చాలా మంది చూసేశారు. చిరు రీమేక్ చేస్తున్నాడన్న వార్త రాగానే మరింత మంది చూశారు. ఇంత మంది చూసిన ఈసినిమాకి జజ్ ఎందుకు ఉంటుంది? అందుకే ఈ సినిమా గురించి ఎవరూ మాట్లాడుకోవడం లేదు.
అక్టోబరు 5న ఈ సినిమా విడుదల అవుతోంది. ఆరోజున వసూళ్లు ఎలా ఉంటాయా? అనేది అందరి అనుమానం. ఎలాగూ చూసేసిన సినిమా కదా అని ప్రేక్షకులు లైట్ తీసుకొంటే మాత్రం... భవిష్యత్తులో రీమేకులంటే హీరోలే కాదు, నిర్మాతలూ భయపడే స్థితికి చేరుకొన్నట్టే. అదే జరిగితే.... చిరంజీవి భోళా శంకర్‌కూ దెబ్బ పడినట్టే. ఎందుకంటే అది కూడా రీమేక్ కథే.