మలయాళ సూపర్ హిట్ అయ్యప్పయునుమ్ కోషియమ్ తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మలయాళంలో బీజూ మీనన్, పృథ్వీరాజ్ చేసిన పాత్రల్ని ఇక్కడ పవన్ కల్యాణ్, రానా చేస్తున్నారు. నిజానికి ఇది మల్టీస్టారరే. కానీ `భీమ్లా నాయక్`లో ఎక్కడా మల్టీస్టారర్ లక్షణాలు కనిపించడం లేదు. ఇది కేవలం పవన్ సినిమాగానే చిత్రబృందం ఫోకస్ చేస్తోంది. అప్పయ్య, కోషియమ్ అనే ఇద్దరి కథ కాబట్టి.. అక్కడ అప్పయ్యయునుమ్ కోషియమ్ అనే పేరు పెట్టారు. ఇక్కడ మాత్రం టైటిల్ కూడా పవన్ పాత్రపైనే పెట్టారు. అంతేకాదు.. ఆగస్టు 15 సందర్భంగా విడుదల చేసిన టీజర్ లో రానా ఎక్కడా కనిపించలేదు. దాంతో ఈ సినిమాని మల్టీస్టారర్ గా కాకుండా, సింగిల్ స్టారర్ గా రూపొందిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సినిమాకి త్రివిక్రమ్ రచనా సహకారం అందించిన సంగతి తెలిసిందే.
తన దోస్త్ పవన్ కల్యాణ్ ని దృష్టిలో ఉంచుకుని, ఈ సినిమాలో భారీ మార్పులూ చేర్పులూ చేశారన్న టాక్ ముందు నుంచీ వినిపిస్తూనే ఉంది. టీజర్ చూస్తే ఆ మార్పులు ఏ లెవిల్ లో ఉన్నాయో అర్థం అవుతోంది. రానా పాత్రని పూర్తి గా తగ్గించేసి, పవన్ పాత్రని హైలెట్ చేస్తూ సాగారని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. అది నిజమే అన్న సంగతి భీమ్లా నాయక్ టీజర్ చూస్తే అర్థమైపోతోంది. పాపం.. రానా. ఇది మల్టీస్టారర్ సినిమా అనుకుని, ఇరుక్కుపోయాడన్న కామెంట్లు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. దీనికి చిత్రబృందం ఎలాంటి సమాధానం చెబుతుందో?