ఏపీలో ఎన్నికల హంగామా నడుస్తోంది. తెలంగాణలోనూ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో 'సినిమా' కబుర్లు పెద్దగా వినిపించడం లేదు. ప్రజలకూ సినిమాలపై మూడ్ లేదు. దానికి తగ్గట్టుగానే పెద్ద సినిమాలన్నీ వాయిదా పడిపోయాయి. కీలకమైన వేసవి సీజన్‌లోనూ స్టార్ల సినిమాల్ని విడుదల చేయడానికి నిర్మాతలు భయపడిపోతున్నారు. సరే, పెద్ద సినిమాలు రావడం లేదు. కనీసం చిన్న, మీడియం రేంజు చిత్రాలైనా వస్తాయి కదా, అనుకొంటే ఇప్పుడు వాటికీ ఎలక్షన్ ఫీవర్ పట్టుకొంది. గత రెండు వారాలుగా బాక్సాఫీసు ముందుకు సరైన సినిమా రాలేదు. ఈవారం పరిస్థితీ అంతే. ఎన్నికలు అయ్యేంత వరకూ ఇదే సీన్ కొనసాగే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. ఈనెల 24న రావాల్సిన దిల్ రాజు సినిమా 'లవ్ మీ' నిరవధికంగా వాయిదా పడింది. ఏపీలో ఎన్నికల ఫీవర్ తగ్గాకే ఈ సినిమాని విడుదల చేస్తారు. నవదీప్ 'లవ్ గురు', 'శశివదనే' లాంటి చిన్న సినిమాలూ ఈ సీజన్‌లో రావడానికి భయపడున్నాయి. ఈ చిత్రాలూ ఇప్పుడు వాయిదా పడ్డాయి. ఇవే కాదు.. ఈ నెలలో రావాల్సిన సినిమాలన్నీ ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ వేటలో ఉన్నాయి. చిన్న సినిమాల్లో మంచి కంటెంట్ ఉండి, మౌత్ పబ్లిసిటీ తోడైతే తప్ప జనాలు థియేటర్ల వరకూ రారు. ఎలక్షన్ హీట్ లో ఇప్పుడు ఏపీ, తెలంగాణ ప్రజలకు సినిమాల గురించి పట్టించుకొనే తీరికే లేదు. ఈ సమయంలో సినిమాల్ని విడుదల చేయడం రిస్కే. అందుకే నిర్మాతలు తొందర పడడం లేదు. అలాగని ఎన్నికలు అయ్యాక మంచి డేట్ దొరుకుతుందా అంటే గ్యారెంటీ లేదు. అప్పుడు పెద్ద సినిమాలన్నీ రెడీ అయిపోతాయి. సోలో రిలీజ్‌లు ఉండవు. ఎన్నికల హంగామాలో సినిమాని విడుదల చేసి చేతులు కాల్చుకోవడమా, లేదంటే పెద్ద సినిమాలతో పోటీ పడి రిస్క్ చేయడమా? అనే సంకట స్థితిలో ఉన్నారు కొంతమంది నిర్మాతలు.