ఫిదాతో.. లవ్ స్టోరీల స్పెషలిస్ట్ అని మరోసారి నిరూపించుకున్నాడు శేఖర్ కమ్ముల. తన నుంచి ఇప్పుడు మరో ప్రేమకథ వస్తోంది. అదే `లవ్ స్టోరీ`. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించారు. ఈ సంక్రాంతికి ఈ సినిమా విడుదల అవుతుందని అంతా భావించారు. కానీ.. టీజర్‌తో సరిపెట్టేశాడు శేఖర్‌కమ్ముల. ఈ రోజు.. `లవ్ స్టోరీ` టీజర్ విడుదలైంది. చైతూ, సాయి పల్లవి కెమిస్ట్రీ, వాళ్ల ప్రేమలోని బలం, వాళ్ల లక్ష్యాలూ.... వీటి చుట్టూ టీజర్ నడిపించాడు. ఎప్పటిలానే.. శేఖర్ మార్క్ స్పష్టంగా కనిపించింది.
పవన్ సి హెచ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఫొటోగ్రఫీ.. ఈ సినిమాకి క్లాస్ లుక్ తీసుకొచ్చాయి. `ఏంద్రా ఒదిలేస్తవ నన్నూ..` అనే డెప్త్ డైలాగ్ తో ఈ టీజర్ ని ముగించారు. ఈ డైలాగ్ `సుజనా.. నన్ను వదిలేస్తున్నావా..` ని గుర్తు చేసినా - అందులో ఫీల్ ఉండడంతో... మనసుల్లోకి వెళ్లిపోతుంది. నాగచైతన్య లుక్ కొత్తగా లేకపోయినా.. తను తెలంగాణ యాసలో డైలాగులు చెప్పడంతో కొత్త నాగచైతన్యని చూస్తున్నట్టుంది. మొత్తానికి శేఖర్ ఖాతాలో మరో హిట్టు చేరే సంకేతాలు ఈ టీజర్‌లో కనిపిస్తున్నాయి.