ఎన్నికలంటేనే డబ్బుతో ముడి పడిన వ్యవహారం. ఎం.ఎల్.ఏ... ఏంపీ సీట్లు పక్కన పెట్టండి. వార్డు మెంబరు ఎన్నికల్లోనే డబ్బులు పంచే సంస్క్కృతి కనిపిస్తోంది. ఓటుకు నోటు ఎక్కడైనా కామన్ అయిపోయింది. ఇప్పుడు అది `మా` ఎలక్షన్లకీ పాకింది. ఈసారి మా ఎన్నికలు ఎప్పుడూ లేనంత రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్, విష్ణు మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇద్దరూ నువ్వా? నేనా? అన్నట్టు ప్రచారం చేశారు. అయితే చివరి క్షణాల్లో ఓటుకి నోటు అంటూ... డబ్బులు కూడా పంచిపెట్టారని టాక్. ఎన్నికల నోటిఫికేషన్‌కి ముందే నరేష్ ఒక్కొక్కరికీ పది వేలు పంచారని వార్తలొచ్చాయి. ఇప్పుడు నరేష్ `ఓటుకి పాతిక వేలు పంచుతున్నారు` అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆదివారం 'మా' ఓటింగ్. ఈ సందర్భంగా శనివారం హైడ్రామా చోటు చేసుకుంది. ప్రకాష్ రాజ్ ప్యానల్ వాళ్లు ఓటర్లని మభ్య పెట్టడానికి ఓటుకి పది నుంచి పాతిక వేలు వరకూ ఇస్తున్నారంటూ.. నరేష్ ఓ వీడియో విడుదల చేశారు. కేవలం డబ్బు పంచి, ఈ ఎన్నికలలో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆ వెంటనే శ్రీకాంత్ కూడా ఓ వీడియో బైట్ విడుదల చేశారు. డబ్బులు పంచుతోంది మేం కాదు, మీరు అంటూ నరేష్ పై డైరక్ట్ ఎటాక్ చేశారు. నరేష్ అబద్ధాలు చెబుతున్నారని, ఆయన ట్రాప్ లో పడొద్దని `మా` సభ్యుల్ని కోరారు. ``డబ్బులు మీరు పంచి, మమ్మల్ని అంటున్నారా`` అంటూ సీరియస్ అయ్యారు. మొత్తానికి ఓటుకు నోటు వ్యవహారం.. మా ఎన్నికలలో కూడా దాపురించింది. పట్టుమని 900 మంది కూడా లేని మా లో... ఇన్ని రాజకీయాలా? ఇన్ని ప్రలోభాలా? అంటూ.. యావత్ తెలుగు ప్రపంచం నివ్వెరబోతోంది. ఇదంతా మా ప్రతిష్టని మంటగలపడానికే అనే వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి.