రీమేక్ సినిమా ఈజీ అనుకుంటారు గానీ.. దాన్ని మించిన కష్టం ఇంకోటి ఉండదు. ఉన్నది ఉన్నట్టు తీస్తే.. కట్ పేస్ట్ అంటారు. మార్పులు చేర్పులూ చేసేస్తే - అసలు విషయాన్ని చెడగొట్టావ్ అని నిందలు వేస్తారు. అందుకే చాలామంది `కాపీ పేస్ట్` సిద్ధాంతాన్ని ఫాలో అయిపోతారు. ఇప్పుడు `మాస్ట్రో` విషయంలో మేర్లపాక గాంధీ అదే చేశాడు. బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన చిత్రం `అంధాధూన్`. దీన్ని తెలుగులో రీమేక్ చేశారు. నితిన్ హీరో. ట్రైలర్ సోమవారం విడుదలైంది. ట్రైలర్ చూస్తే `అంధాధూన్` కి మక్కీకి మక్కీ అనిపిస్తుంది. సేమ్ టూ సేమ్ దింపేశాడు మేర్లపాక. తన తెలివితేటలేం పెద్దగా వాడలేదు.
కథ, కథనం, సీన్లు ఈ విషయాల్లో మార్పులు చేయడానికి దర్శకుడు సాహసించకపోవొచ్చు. అయితే ట్రైలర్ కూడా కాపీనే అనే విమర్శలు వస్తున్నాయి. `అంధాధూన్` ట్రైలర్ లో ఏముందో, మాస్ట్రో ట్రైలర్ లోనూ అదే కనిపించింది. ట్రైలర్ ని సైతం.. కట్ పేస్ట్ చేస్తే ఎలా? అంటూ ఇప్పుడు జనాలు మేర్లపాక గాంధీని ట్రోల్ చేస్తున్నారు. ట్రైలర్ కట్ చేయడంలో ఒకొక్కరిదీ ఒక్కో పంథా ఉంటుంది. అయితే ఇక్కడ కూడా దర్శకుడు కొత్తగా ఆలోచించకపోవడం చూస్తే.. సినిమాని ఎంత కార్బన్ కాపీలా మార్చేశారో అర్థం చేసుకోవొచ్చు.