ఒకే ఒక్క సినిమాతో తనకంటూ ఒక ఫ్యాన్ పాలోయింగ్ ని ఏర్పరుచుకున్నాడు అజయ్ భూపతి. ముఖ్యంగా యూత్ లో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. ఆర్ఎక్స్ 100 అలాంటి సినిమా మరి. ఆర్ఎక్స్ 100 చూసిన కుర్రాళ్ళు పిచ్చెక్కిపోయారు. దమ్మున్న డైరెక్టర్ వచ్చాడని కితాబిచ్చారు. అయితే ద్వితీయ విఘ్నాన్ని దాటలేకపోయాడు అజయ్. రెండో సినిమాగా తీసిన 'మహాసముద్రం' అజయ్ ఫ్యాన్స్ ని నిరాశ పరిచింది. మహాసముద్రం సెట్స్ పైకి వెళ్ళినప్పుడే భారీ అంచనాల ఏర్పడ్డాయి. ఆర్ఎక్స్ 100 సంచలన దర్శకుడు కావడం, శర్వానంద్, సిద్ధార్ద్, అతిది రావ్, జగపతి బాబు.. ఇలా మంచి తారాగణం వున్న ప్రాజెక్ట్ కావడంతో మహాసముద్రంపై అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ట్రైలర్, టీజర్ లో ఆసక్తిని ఇంకా పెంచారు,
అయితే తీరా సినిమా చూసే సరికి చాలా నిరాశ పరిచింది. ఆకట్టుకోలేని స్క్రీన్ ప్లే, బలం లేని కథతో నిరాశతో వెనుతిరిగారు ప్రేక్షకులు. ఆర్ఎక్స్ 100 లాంటి సంచలనం అవుతుందన్న మహాసముద్రం.. చప్పగా మిలిగిపోవడంతో ఫ్యాన్స్ నిరాశ పడ్డారు. అయితే తాజాగా సినిమా అపజయం పై ఫ్యాన్స్ కి ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పాడు అజయ్. 'మహా సముద్రం ఎంటన్నా.. అలా తీశావ్. చాలా అంచనాలు పెట్టుకున్నాం.'' అని ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ..'' అంచనాలు అందుకోలేకపోయినందుకు క్షమించండి. నెక్స్ట్ టైం తప్పుకుండా మీ అంచనాలు అందుకుంటా'' అని ట్వీట్ చేశాడు అజయ్. మహాసముద్రం తర్వాత అజయ్ నుంచి ఇంకా కొత్త సినిమా ప్రకటన రాలేదు. అజయ్ దగ్గర కథలు వున్నాయి. అయితే ప్రాజెక్ట్ ఓకే కావడమే ఆలస్యం.