దూరదర్శన్‌లో మహాభారత్ చూడడం.. చిన్నప్పటి అద్భుతమైన జ్ఞాపకం. ఆ ధారావాహికలో పాత్రలన్నీ ఇప్పటికీ కళ్లముందు మెదులుతూ ఉంటాయి. భీముడి పాత్ర ధారి అయితే మరీనూ. భీముడంటే అచ్చం ఇలానే ఉంటాడా..? అన్నట్టుండే దేహ ధారుడ్యంతో.. ఆ పాత్రధారి అంతలా ఆకట్టుకున్నాడు. అయితే ఇప్పుడు మహాభారత్ భీముడు కన్నుమూశాడు. మహాభారత్‌లో భీముడి పాత్రతో దేశ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్న ప్రవీణ్ కుమార్ సోబ్తీ సోమవారం అర్ధరాత్రి తుది శ్వాసవిడిచారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. మహాభారత్ తో వచ్చిన క్రేజ్ తో బాలీవుడ్‌లో అవకాశాలు వెల్లువెత్తాయి. దాదాపు 50కిపైగా హిందీ చిత్రాల్లో నటించారు.కమల్‌హాసన్ నటించిన ‘మైఖెల్ మదన్ కామరాజు’ సినిమాతో `భీమ్ బాయ్`గా అలరించారు.
ప్రవీణ్ నటుడే కాదు. క్రీడాకారుడు కూడా. హ్యామర్, డిస్క్‌త్రోలో ఛాంపియన్‌గా నిలిచారు. హాంకాంగ్‌లో జరిగిన ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో ప్రవీణ్ భారత్‌కు పలు పతకాలను సాధించారు. ఒలింపిక్స్‌లో కూడా భారత్‌కు రెండుసార్లు ప్రాతినిధ్యం వహించారు. రాజకీయాల్లో కూడా అడుగుపెట్టారు. 2013లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.