'మహర్షి' సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ రూపొందిన మహర్షి పైరసీ నుండి తప్పించుకోలేకపోయింది. ప్రీమియర్స్ చూసిన వాళ్లలో కొందరు లైవ్‌గా వీడియోల్ని ఇంటర్నెట్‌లో పెట్టేశారు. సినిమా పూర్తయ్యే సమయానికి వాటన్నింటినీ ఓ వీడియోగా మార్చి ఇంటర్నెట్‌లో వదిలేశారు. ఇది 'మహర్షి' టీమ్‌కి ఊహించని షాక్. అభిమానులు రాత్రంతా మేల్కొని ఈ తరహా వీడియోల గురించి రిపోర్ట్ చేస్తూనే వచ్చారు.
కానీ జరగాల్సిన నష్టమయితే జరిగిపోయింది. ప్రీమియర్స్‌తో వస్తున్న అతి పెద్ద సమస్య ఇది. జరుగుతున్న విషయాన్ని అనుక్షణం లైవ్ రిపోర్టింగ్ చేయడం ఒక ఎత్తైతే, దాన్ని యథాతథంగా వివరించి చెప్పడం, అక్కడికక్కడే ఎనాలసిస్ చేయడం వల్ల సినిమాలకు చాలా నష్టం జరుగుతోంది. గతంలో చాలా సినిమాలకు ఇలాంటి సమస్యే ఎదురైంది. అయితే, ఈ సమస్య పట్ల ఎవరూ అంత సీరియస్‌గా స్పందించడం లేదు.
ఇండియాలో సినిమా విడుదలయ్యేటప్పటికే, సినిమాకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోనో, వాట్సాఫ్ వంటి మొబైల్ అప్లికేషన్స్‌లోనో దర్శనమివ్వడం అంటే, అంతకన్నా దారుణం ఇంకేముంటుంది.? టికెట్ల ధర పెంచడం మీద ఉన్న శ్రద్ధ, పదో వంతైనా ఇలాంటి అకృత్యాల్ని అడ్డుకోవడంలో నిర్మాతలు పెడితే బాగుంటుంది. అదే సమయంలో ప్రేక్షకులూ సినిమాని ఎంజాయ్ చేయాలి తప్ప, దాన్ని పైరసీ చేయాలనుకోవడం సబబు కాదు.