తమిళనాట ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్న దర్శకుడి పేరు లోకేష్ కనగరాజ్. `ఖైదీ` సినిమాతో.. తెలుగు, తమిళ చిత్రసీమల్లో లోకేష్ పేరు మార్మోగిపోయింది. ఆ వెంటనే... విజయ్ తో సినిమా మొదలెట్టేశాడు. ఇప్పుడు కమల్ హాసన్ తో సినిమా ప్రకటించేశాడు. త్వరలోనే లోకేష్ మహేష్ బాబుతో ఓ సినిమా చేయబోతున్నాడు.
ఇప్పటికే ఈ విషయమై మహేష్ - లోకేష్ మధ్య సంప్రదింపులు జరిగినట్టు సమాచారం అందుతోంది. అంతేకాదు... లోకేష్ మహేష్ కి ఓ లైన్ చెప్పేశాడట. ఆ లైన్ వినగానే మహేష్ థ్రిల్ అయిపోయాడని, `ఇదే కథతో సినిమా చేద్దాం...` అని మహేష్ లోకేష్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని టాక్. సాధారణంగా పూర్తి స్క్రిప్టు లేనిదే మహేష్ కథలకు ఓకే చెప్పడు. లైన్ బాగుంటే సరిపోదని, స్క్రిప్టు మొత్తం బాగుండాలన్నది మహేష్ అభిప్రాయం. కొన్ని కథలు లైన్ల వరకూ బాగుంటాయి. స్క్రిప్టు దశలో కుదరవు. అందుకే మహేష్ ఎప్పుడూ లైన్ లకు పడిపోడు. కానీ ఈసారి.. మాత్రం లోకేష్ కేవలం లైన్‌తోనే మహేష్‌ని మెప్పించడం విశేషమే. కమల్ హాసన్ తో సినిమా పూర్తవ్వగానే.. మహేష్ బాబు సినిమా స్క్రిప్టు పనులు మొదలెడతాడట లోకేష్. 2022లో ఈ కాంబో పట్టాలెక్కే అవకాశాలున్నాయి.