మహేష్ కెరీర్‌లో టాప్ 3 సినిమాల లిస్టు తీస్తే.. అందులో తప్పకుండా `అతడు` సినిమా ఉంటుంది. త్రివిక్రమ్ ని దర్శకుడిగా నిలబెట్టిన సినిమా అది. హాలీవుడ్ తరహాలో స్టైలీష్ మేకింగ్, అదిరిపోయే హీరోయిజం, అద్భుతమైన డైలాగులు, పర్‌ఫెక్ట్ కాస్టింగ్ తో రూపొందిన సినిమా అతడు. అందుకే... ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ అంతులేని ప్రేమ. ఈ సినిమా విడుదలై నేటికి పదిహేనేళ్లు. ఈ సందర్భంగా అతడు విశేషాల్ని ఓసారి గుర్తు చేసుకుంటే.
అతడు.. దర్శకుడిగా త్రివిక్రమ్‌కి రెండో సినిమా. నిజానికి ఈ సినిమాతోనే దర్శకుడిగా తన ప్రయాణం ప్రారంభించాలనుకున్నాడు. ముందు ఈ కథని పవన్ ని వినిపిస్తే.. కథ మొదలెట్టిన పది నిమిషాలకే పవన్ నిద్రపోయాడట. ఆ తరవాత మహేష్ దగ్గరకు వెళ్తే.. కథంతా విని.. సైలెంట్ గా లేచి వెళ్లిపోయాడట. కాకపోతే.. కాసేపటికి తిరిగొచ్చి.. `కథ చాలా బాగుంది.. మనం చేద్దాం` అని షేక్ హ్యాండ్ ఇచ్చాడట. కానీ.. మహేష్ ఖాళీ అయ్యేసరికి టైమ్ పట్టింది. ఈ గ్యాప్‌లో త్రివిక్రమ్ `నువ్వే నువ్వే` సినిమా పూర్తి చేశాడు. `అతడు` త్రివిక్రమ్ రెండో సినిమా అయ్యింది.
ఈ సినిమాలో డైలాగులు చాలా పాపులర్ అయ్యాయి. ప్రతీ సీన్ లో ఓ మంచి డైలాగ్ అయినా వినిపిస్తుంది.
గన్ చూడాలనుకో.. కానీ బుల్లెట్ ని చూడాలనుకోకు.. చచ్చిపోతావు
నేనూ వస్తాను.. నేనే వస్తాను
కూతుర్ని ఇవ్వమంటే... క్వశ్చన్ బ్యాంకుని ఇచ్చావేంటి తండ్రీ
జింకని వేటాడేటప్పుడు పులి ఎంత ఓపిగ్గా ఉంటుంది.? మరి పులినే వేటాడేటప్పుడు ఇంకెంత ఓపిక కావాలి?
- ఇలా ఎన్నో మంచి డైలాగులు కుదిరాయి.
యాక్షన్ ఎపిసోడ్స్‌కీ మంచి పేరొచ్చింది. క్లైమాక్స్లో సోనూ, మహేష్ గాల్లో వేలాడే షాట్ కోసం చిత్రబృందం చాలా కష్టపడింది. ఈ క్లైమాక్స్ కోసమే 27 రోజులు పట్టింది.