సినిమా లెక్కలు మారిపోయాయి. బడ్జెట్ ఎంత పెరిగినా, రాబట్టుకొనే సామర్థ్యం నిర్మాతలకు అర్థమైంది. అందుకే సినిమా సినిమాకీ బడ్జెట్లు పెరుగుతూ పోతున్నాయి. తెలివిగా వ్యవహరిస్తే, కొబ్బరికాయ కొట్టకముందే లాభాల్ని కూడా చూడొచ్చు. మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమాకి అదే జరుగుతోంది.
మహేష్ - త్రివిక్రమ్ నుంచి అతడు లాంటి సూపర్ హిట్ వచ్చింది. ఖలేజా ఫ్లాప్ అయినా, మహేష్ ఫ్యాన్స్‌కి ఈ సినిమా అంటే ప్రత్యేకమైన అభిమానం. ఇప్పుడు ఈ కాంబోలో హ్యాట్రిక్ రూపుదిద్దుకుంటోంది. జూన్‌లో ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. హారిక హాసిని నిర్మిస్తున్న ఈ చిత్రానికి బడ్జెట్ దాదాపుగా 200 కోట్లని తెలుస్తోంది. అందులో మహేష్ పారితోషికం రూ.60 కోట్లు, త్రివిక్రమ్ వాటా రూ.50 కోట్లు. మిగిలిన 90 కోట్లు ప్రొడక్షన్ కాస్ట్. అంటే 200 కోట్లవుతుందన్నమాట. ఈ సినిమా డిజిటల్ రైట్స్ రూ.150 కోట్లకు కొనడానికి ఓ సంస్థ ముందుకు వచ్చిందట. థియేటరికల్ రైట్స్ రూ.150 కోట్లకు అమ్ముడుపోయే ఛాన్సుంది. అంటే.. వంద కోట్ల లాభం ముందే కనిపిస్తోంది. థియేటరికల్ రైట్స్ కూడా ముందే క్లోజ్ చేసి, ఆ అడ్వాన్సులతో సినిమా మొదలెడితే.. చేతి నుంచి రూపాయి పెట్టకుండా వంద కోట్ల లాభాన్ని చూడొచ్చు.