మహేష్ బాబు సినిమా అంటే సూపర్ బజ్ వచ్చి తీరాల్సిందే. కొత్త దర్శకుడైనా సరే అభిమానుల అంచనాలు ఎక్కడో ఉంటాయి. అయితే `మహర్షి` విషయంలో మాత్రం ఇదంతా రివర్స్ లో జరుగుతోంది. పబ్లిసిటీ సరిగా లేకపోవడం, పాటలు ఆశించినంతగా క్లిక్ అవ్వకపోవడంతో ఈసినిమాపై మరీ అంతగా అంచనాలేం వేసుకోవడం లేదు. కానీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో దిల్‌రాజు, అశ్వనీదత్, పీవీపీ, వంశీ పైడిపల్లి ఇచ్చిన స్పీచులు చూస్తుంటే మాత్రం ఈ సినిమా ఎక్కడికో వెళ్లిపోవడం ఖాయం అనిపిస్తోంది. మహేష్ గత రికార్డులన్నీ బద్దలు కొట్టగల సత్తా ఈ సినిమాకి ఉందని పిస్తోంది.
ఈ నిర్మాతలలో ఒకరైన ప్రసాద్ పొట్లూరి, సినిమా విడుదలకు ముందే సక్సెస్ మీట్ విజయవాడలో పెట్టానంటూ డేట్‌తో సహా చెప్పారు. దిల్‌రాజు అయితే ఇంకో అడుగు ముందుకేశారు. 'మీరు ఎన్ని అంచనాలతో అయినా రండి మేం సంతృప్తి పరుస్తాం' అంటున్నారు. అశ్వనీదత్ కూడా అంతే. ఈ సినిమా అన్ని రికార్డులూ బద్దులు కొడుతుందని జోస్యం చెప్పేశారు. వంశీ పైడిపల్లి 'ఫ్యాన్స్ గర్వపడే సినిమా తీశా. మీరంతా కాలర్ ఎత్తుకుని థియేటర్ నుంచి బయటకు వస్తారు. మహేష్ 25 చిత్రాలలో ఇదే బెస్ట్ అవుతుంది' అని ఇంకొంచెం గట్టిగా చెబుతున్నాడు. మొత్తానికి.. 'మహర్షి'కి తమ స్పీచుల ద్వారా హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు వీళ్లంతా. మరి ఇవన్నీ ఒట్టి మాటలేనా? లేదంటే గట్టిగా కొట్టే సత్తా నిజంగానే మహర్షిలో ఉందా? అనేది తెలియాలంటే ఈనెల 9 వరకూ ఎదురు చూడాల్సిందే.