కన్నప్ప సినిమాపై మంచు విష్ణు బోలెడన్ని ఆశలు పెట్టుకొన్నాడు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్. తన మార్కెట్, తన సినిమా బిజినెస్, గత చిత్రాల రిజల్ట్ ఇవన్నీ పట్టించుకోక... తన కెరీర్‌లోనే అతి పెద్ద రిస్క్ చేసేశాడు. ఈ సినిమాపై దాదాపు రూ.100 కోట్లు ఖర్చు పెట్టినట్టు స్వయంగా విష్ణునే చెబుతున్నాడు. విష్ణు సినిమా అంటే.. ఆ వంద కోట్లు రాబట్టుకోవడం కష్టమే. కానీ, ఇందులో ప్రభాస్ ఉన్నాడు. మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్లు ఉన్నారు. విష్ణు భరోసా కూడా అదే. ప్రభాస్ కోసమైనా ఈ సినిమా జనం చూస్తారన్న నమ్మకం. బిజినెస్ కూడా అదే ఊపుతో జరుగుతుందన్న ఆశ.
కానీ, విష్ణు అనుకొన్నది ఒకటి, అవుతోంది మరోటి. ఇటీవల కన్నప్ప టీజర్ విడుదల చేశారు. ఒక్క టీజర్ తో బిజినెస్ బజ్ మొదలవుతుందని భావించాడు. కానీ అలా ఏం జరగడం లేదు. ఇందులో స్టార్లున్నా ఇది మంచు సినిమానే అనే కోణంలో కన్నప్ప ని లెక్కగడుతున్నారేమో అనిపిస్తోంది. అందుకే బిజినెస్ పరంగా ఎలాంటి అలికిడీ లేదు. కనీసం ఓటీటీ, శాటిలైట్ బిజినెస్ కూడా క్లోజ్ కాలేదు. టీజర్‌కు అనుకొన్నంత స్థాయిలో స్పందన లేకపోవడమే ఇందుకు కారణం అనిపిస్తోంది. మరీ విష్ణు లెక్కలేసుకొన్నట్టు భారీ స్థాయిలో కన్నప్ప బిజినెస్ జరగడం కష్టం. కానీ.. మినిమం స్పందన అయినా ఉండాలి కదా? అదే మంచు అండ్ కో ని కలవరపెడుతోంది.
ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ వచ్చాక, మరికొంత ప్రమోషన్ స్టఫ్ విడుదల చేశాక.. బిజినెస్ పరంగా కాస్త అలికిడి వస్తుందేమో.. అనే ఆశతో ఉంది టీమ్. ఈ సినిమాపై విష్ణు భారీగానే ఖర్చు పెట్టాడు. అదంతా విజువల్స్ రూపంలో కనిపిస్తే తప్ప మార్కెట్ మొదలవ్వదు. విష్ణు అలాంటి ప్రయత్నమేదో చేయాలి.