ఈదఫా `మా` అధ్యక్ష ఎన్నికలు నువ్వా? నేనా? అన్నట్టుగానే జరగబోతున్నాయని టాలీవుడ్ ఫిక్సయిపోయింది. ఆ ఎన్నికల కోసం మూడు నెలల ముందు నుంచే ఆసక్తిగా ఎదురు చూడడం మొదలెట్టింది. ఈసారి ప్రకాష్ రాజ్, విష్ణు, జీవిత, హేమ బరిలో ఉండడంతో.. పోటీ ఆసక్తి కరంగా మారింది. అయితే నిన్నా మొన్నటి వరకూ ప్రకాష్ రాజ్ కే విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయని భావించారు. ముఖ్యంగా చిరంజీవి అండదండలు ప్రకాష్ రాజ్ కి ఉన్నాయని, అందుకే ఈసారి ఆయన గెలుపు నల్లేరుపై నడకలా సాగబోతోందని ఫిక్సయ్యారు. అంతలోనే మంచు విష్ణు ఈ కథలో ట్విస్ట్ ఇచ్చారు.
`మా` బిల్డింగ్ నిర్మాణానికి అయ్యే ఖర్యంతా తానే భరిస్తానని మంచు విష్ణు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ బిల్డింగ్ నిర్మాణానికి దాదాపు రూ.2 కోట్ల వరకూ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఇదంతా ఇప్పుడు విష్ణునే చూసుకోబోతున్నాడు. `మా బిల్డింగ్` అనేది ఎప్పటి నుంచో నలుగుతున్నవ్యవహారం. దానికి విష్ణు ఫినిషింగ్ టచ్ ఇచ్చేసినట్టైంది. ఎప్పుడైతే విష్ణు నుంచి ఈ ప్రకటన వచ్చిందో.. అప్పుడే `మా` సభ్యుల మనసు గెలుచుకున్నాడు విష్ణు. వాళ్లంతా ఇప్పుడు విష్ణు గెలుపుకి కృషి చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈసారి `మా` అధ్యక్షుడిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఏకగ్రీవంగానే ఎంచుకోవాలని సినీ పెద్దలు భావిస్తున్నారు. ఆ ఒక్కడూ.. ఎవరన్నది కీలకమైన ప్రశ్న. ఎప్పుడైతే.. మా బిల్డింగ్ ఖర్చంతా తాను భరిస్తానని విష్ణు ముందుకొచ్చాడో.. ఏకగ్రీవ అభ్యర్థిగా తాను మంచి ఆప్షన్ అయ్యాడు. పైగా విష్ణుకి వైస్ ప్రెసిడెంట్ గా చేసిన అనుభవం ఉంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఏకగ్రీవ అభ్యర్థిగా ఈసారి విష్ణునే ఫైనల్ చేసే అవకాశాలున్నాయి. ఒకవేళ పోటీ పెట్టినా... తానే గెలిచి తీరుతాడని... ఫిల్మ్ ఇండ్రస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.