ఓ పెద్ద హీరో సినిమా, అందులోనూ క్రేజీ కాంబినేషన్‌లో అవకాశం వస్తే ఎవరు వదులుకొంటారు? సెకండ్ హీరోయిన్ అయినా ఫర్వాలేదని దూకేస్తారు. మీనాక్షి చౌదరి కూడా అలానే అనుకొంది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.
త్రివిక్రమ్ 'గుంటూరు కారం'లో మీనాక్షి చౌదరి కూడా హీరోయినే అనుకొంటున్నారు జనాలు. కానీ ఇప్పుడు ఆమెది కేవలం అతిథి పాత్ర అని తేల్చేశాడు మహేష్ బాబు. 'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడిన మహేష్.. 'ఈ సినిమాలో అడగ్గానే స్పెషల్ ఎప్పీరియన్స్ పాత్ర నటించడానికి ఒప్పుకొన్న మీనాక్షి చౌదరికి థ్యాంక్స్' అంటూ కృతజ్ఞతలు తెలిపాడు. మహేష్ తనకి థ్యాంక్స్ చెప్పుకొన్నందుకు పొంగిపోవాలో.. 'గెస్ట్ ఎప్పీరియన్స్' అని సరిపెట్టినందుకు బాధ పడాలో పాపం మీనాక్షికి అర్థం కాలేదు. ఈ సినిమా ప్రమోషన్లలో మీనాక్షికి పెద్దగా వాడుకోనప్పుడే ఇందులో అసలు మీనాక్షికి సరైన పాత్ర పడిందా? లేదా? అనే అనుమానాలు మొదలయ్యాయి. ఆమె పోస్టర్ ఎప్పటికో విడుదల చేశారు. తనపై ఒక్క పాట కూడా లేదు. ఇప్పుడు మహేష్ కూడా మీనాక్షిది గెస్ట్ రోలే అని తేల్చేశాడు.
అయితే త్రివిక్రమ్ సినిమాల్లో ఇది సాధారణంగా జరిగేదే. తన ప్రతీ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఉంటుంది. ఆ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. అలా చాలామంది సెకండ్ హీరోయిన్ గా చేసినా, గుర్తింపు దక్కించుకోలేకపోయారు. ఆ జాబితాలో మీనాక్షి చేరింది అంతే. కాకపోతే.. ఈ పాత్ర నిజానికి శ్రీలీల చేయాలి. ఈ సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకోవడంతో ఆ పాత్రలోకి శ్రీలీల వచ్చింది. శ్రీలీల చేయాల్సిన పాత్ర మీనాక్షికి పడింది. మీనాక్షి ప్లేస్‌లో శ్రీలీల ఉంటే.. త్రివిక్రముడి ట్రీట్మెంట్ మరోలా ఉండేదేమో..?