సంక్రాతి బరిలో దిగుతున్న మూవీస్ లో హానుమాన్ ఒకటి . ప్రజంట్ ఈ మూవీ టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారింది. కారణం స్టార్ హీరోలతో పోటీ పడి రావటం. ఒకప్పుడు మహేష్ బాబు మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన తేజా ఇప్పుడు హీరోగా మహేష్ తో పోటీకి దిగటం. ఇంకో వైపు థియేటర్ల వివాదం. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ మొత్తం మహేష్ గుంటూరు కారం మూవీకి వెళ్లిపోగా కేవలం నాలుగే నాలుగు థియేటర్స్ హనుమాన్ కి దక్కాయి. ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. ఈ క్రమంలోనే హనుమాన్ థియేటర్ల వివాదంపై కూడా చిరు మాట్లాడారు.
‘సంక్రాంతి చాలా మంచి సీజన్. ఎన్ని సినిమాలు వచ్చినా సరే దైవం ఆశీస్సులు ఉండి మన సినిమాలో కంటెంట్ ఉంటే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు. అక్కున చేర్చుకుంటారు. పెద్ద విజయాన్ని అందేలా చేస్తారు. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే ఇది పరీక్షా కాలం అనుకోవచ్చు. కొన్ని థియేటర్లు అనుకున్న విధంగా మనకు లభించకపోవచ్చు. ఇట్స్ ఓకే. ఈరోజు కాకపోతే రేపు చూస్తారు. రేపు కాకపోతే సెకండ్ షో చూస్తారు. సెకండ్ షో కాకపోతే థర్డ్ షో చూస్తారు. కంటెంట్ బాగుంటే ఎన్నో రోజు చూసినా, ఎన్నో షో చూసినా మార్కులు పడతాయి.’ అని చిరంజీవి హనుమాన్ టీమ్ లో ధైర్యాన్ని నింపారు.
‘హనుమాన్’ సినిమాకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం థియేటర్లు సరిగా కేటాయించలేదని ‘హనుమాన్’ నిర్మాత ఆవేదన వ్యక్తం చేశారు. హనుమాన్ సినిమా పాన్ వరల్డ్ రేంజ్‍లో జనవరి 12న రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీలోనూ విడుదల కానుంది. ఇంగ్లిష్, కొరియన్, జపనీస్, చైనీస్, స్పానిష్‍లోనూ విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు.