ట్రోలింగ్ అంటే ముందుగా గుర్తొచ్చేది మంచు ఫ్యామిలీనే. వాళ్లు కావాలని అలా మాట్లాడతారో, లేదంటే మాట్లాడిన ప్రతీ మాటనీ... ట్రోలర్స్ తమకు అనుగుణంగా మలచుకుంటారో తెలీదు గానీ - ఎక్కడ చూసినా వాళ్ల గురించిన మీమ్సే. మా ఎన్నికల సమయంలో మంచు విష్ణుని ఇలానే ట్రోలర్స్ ఆడేసుకున్నారు. `సన్నాఫ్ ఇండియా` ప్రమోషన్లు ఎప్పుడు మొదలెట్టారో అప్పుడు మోహన్ బాబు కూడా వాళ్లకు దొరికేశారు. బుక్ మై షోలో బుక్ అయిన టికెట్లు, ఆ వ్యవహారం.. క్రియేట్ చేసిన ఫన్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా ఫ్లాప్ అయ్యిందన్న బాధ ఒక వైపు.. ఈ సినిమాని ట్రోలర్స్ మరీ ఇంతలా మోసేస్తున్నారన్న అవమానం మరోవైపు. వెరసి.. మంచు ప్యామిలీ రంగంలోకి దిగింది. సోషల్ మీడియాలో తమపై ట్రోల్ చేస్తున్నవాళ్లందరిపైనా కేసులు వేస్తామని, పది కోట్ల పరువు నష్టం వసూలు చేస్తామని బెదిరిస్తోంది. ట్రోలర్స్, మీమర్స్ పై.. ఇంత కోపమా? పది కోట్ల దావానా..? ఇది మరీ టూమచ్. ఇప్పుడు దీనిపై కూడా మీమర్స్, ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు.
మంచు ఫ్యామిలీపై ట్రోల్స్ రావడం ఇదే తొలిసారి కాదు. ఎప్పటి నుంచో ఉన్నదే. కానీ ఈమధ్య కాస్త ఎక్కువైందన్న మాట మాత్రం నిజం. అయితే మంచు వారి వేషాలు కూడా అలానే ఉన్నాయి. వేదికపై వాళ్ల ప్రసంగాలూ, నోరుతిరక్కపోయినా.. ఏదో ఒకటి మాట్లాడేయాలన్న తాపత్రాయాలు, `మేం గొప్ప.. మేమే గొప్ప` అనేలా స్టేట్‌మెంట్లు ఇవన్నీ... అలుసుగా మారిపోయాయి. `మీపై వస్తున్న మీమ్స్ గురించి మీరేమంటారు` అంటూ గతంలో విష్ణుని అడిగితే... `వాటిని లైట్ తీసుకుంటా.. నేనూ నవ్వుకుంటా` అని స్పోర్టీవ్ గా తీసుకున్నాడు విష్ణు. మరి ఇప్పుడు ఆ స్పోర్టీవ్‌నెస్ ఏమైంది..?
ట్రోలింగ్ కి కేవలం మంచు ఫ్యామిలీనే బాధితులు కారు. దాదాపు ప్రతీ హీరో ఇలాంటివి ఎదుర్కొన్నవాళ్లే. బడా బడా హీరోలకూ ఇవి తప్పలేదు. ఒకప్పుడు.. నందమూరి బాలకృష్ణ మీమర్స్‌కి ప్రధాన టార్గెట్. ఆయన చేసిన సినిమాలూ, వేదికపై ప్రసంగాలూ అలా ఉండేవి. కానీ.. ఎప్పుడూ బాలయ్య మీమర్స్ విషయంలో జోక్యం చేసుకోలేదు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న వ్యతిరేకతని పట్టించుకోలేదు. అలాగని ఇవన్నీ బాలయ్య వరకూ చేరలేదని కాదు. చేరినా.. హుందాగా ప్రవర్తించాడు. ఇప్పుడు బాలయ్యపై ట్రోలింగ్ బాగా తగ్గింది. ఆ మాటకొస్తే అస్సలు కనిపించడం లేదు. ఎందుకంటే... `అన్ స్టాపబుల్`లాంటి షోతో బాలయ్య మరింత దగ్గరైపోయాడు. ఓ రకంగా.. బాలయ్య తన ప్రవర్తనతోనే వ్యతిరేకత తగ్గించుకోగలిగాడు. కానీ... మోహన్ బాబు ఫ్యామిలీ ఏం చేస్తోంది..? పుండు మీద కారం చల్లినట్టు ప్రవర్తిస్తోంది. ట్రోలర్స్ పై దావా వేయడం సాధ్యమా? వాటిని ఆపడం.. సాధ్యమా? ఇవేం ఆలోచించలేదు. జస్ట్ రూ.10 కోట్ల పేరుతో బెదిరిస్తోంది అంతే.
ఇద్దరు హీరోలు పనిగట్టుకుని ట్రోల్ చేయిస్తున్నారు... అని ఇటీవల మోహన్ బాబు వ్యాఖ్యానించారు. నిజంగా ఆ ఇద్దరు హీరోలెవరో తెలిస్తే... ఆయన చెప్పేయొచ్చు కదా? ట్రోలింగ్ అంటే ఎవరో పనిగట్టుకుని చేయిస్తున్నారు అనుకుందాం. మరి `సన్నాఫ్ ఇండియా` సినిమా ఏమైంది? దాన్ని కూడా పనిగట్టుకుని ఎవరైనా ఫ్లాప్ చేశారా? థియేటర్లకు జనం వెళ్లకుండా అడ్డుకున్నారా? ఏమో... రేపో మాపో.. `మా సినిమా సూపర్ హిట్టయ్యింది.. కానీ కావాలని ఫ్లాప్ చేశారు` అని అనినా అనొచ్చు.