చిరంజీవి సినిమాలో మోహన్ బాబు నటిస్తే ఎలా ఉంటుంది? అందులోనూ విలన్‌గా..?! అదిరిపోతుంది కదూ. అసలు ఇలాంటి కాంబినేషన్లే కదా, కావాల్సింది. ప్రస్తుతం ఈ కలనే నిజం చేయాలని కొరటాల శివ గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రతినాయకుడి పాత్ర కోసం మోహన్ బాబు పేరుని పరిశీలిస్తున్నారని సమాచారం అందుతోంది.
చిరు సినిమాలో మోహన్ బాబు విలన్ అనగానే... `కొదమ సింహం` గుర్తొస్తుంది. అందులో సుడిగాలి పాత్రలో మోహన్ బాబు విజృంభించిన నటించారు. ఇద్దరూ హీరోలుగా మల్టీస్టారర్ సినిమాలూ చేశారు. బిల్లా రంగా, పట్నం వచ్చిన పతివ్రతలు వీళ్ల కాంబినేషన్‌లోనే వచ్చాయి. అవి రెండూ బాగా ఆడాయి. ఆ తరవాత ఇద్దరూ కలిసి `చక్రవర్తి`లాంటి సినిమాల్లోనూ నటించారు. ఆ తరవాత మోహన్ బాబు హీరో అయిపోవడం వల్ల ఈ కాంబోని మళ్లీ చూసే అవకాశం రాలేదు. ఇన్నాళ్లకు కొరటాలకు ఓ మంచి ఆలోచన వచ్చింది. మరి అది ఎంత వరకూ నిజం అవుతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.