కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు నటించిన 'గాయత్రి' సినిమా నేడు ప్రేక్షకుల ముందుకొస్తోంది. భారీ అంచనాలే వున్నాయి ఈ సినిమాపైన. అందుక్కారణం మోహన్‌బాబు, ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఇందులో నటిస్తుండడమే కావొచ్చు. మోహన్‌బాబు నుంచి చాలాకాలం తర్వాత కంప్లీట్ ప్యాకేజ్ అనే ప్రచారం చిత్ర యూనిట్ నుంచి గట్టిగా జరుగుతోంది. మోహన్‌బాబుతోపాటు ఈ సినిమాలో ఆయన కుమారుడు విష్ణు కూడా నటించాడు. మనోజ్ ఈ సినిమాలో నటించకపోయినా, కథతోపాటు కథనం విషయంలో తనదైన సలహాల్ని ఇచ్చాడట. ఈ విషయాన్ని మోహన్‌బాబు స్వయంగా వెల్లడించారు.
చాలాకాలం తర్వాత చాలా చాలా ఎంజాయ్ చేసిన సినిమా అంటూ 'గాయత్రి' గురించి మోహన్‌బాబు చెప్పారు. కొన్ని సినిమాలకు మాత్రమే అన్ని ఎమోషన్స్ బాగా కుదురుతాయనీ అలాంటి సినిమా 'గాయత్రి' అని అంటున్నారు మోహన్‌బాబు. సినిమాలో తన పాత్రకి నెగెటివ్ షేడ్స్ కన్పిస్తాయని ఆయన చెబుతున్ననట్టుగానే 'గాయత్రి' ప్రోమోస్‌లో ఆయన బాడీ లాంగ్వేజ్ కన్పిస్తోంది. తెరపై మోహన్‌బాబు స్క్రీన్ ప్రెజెన్స్ సింప్లీ సూపర్బ్‌గా వుండబోతోందని ప్రోమోస్ చూసినవారు అనకుండా వుండలేరు. సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు, ఇలా చేస్తే బావుంటుంది - అలా చేస్తే బావుంటుందని విష్ణు తనకు సూచనలు ఇచ్చాడనీ, ఆ సూచనల్లో కొన్నింటిని పాటించాలననీ మోహన్‌బాబు చెప్పారు.
విష్ణు కూడా 'గాయత్రి' సినిమాని చాలా ప్రేమించి చేశాడనీ, ప్రతి ఒక్కరికీ నచ్చే చిత్రమవుతుందని అన్నారాయన. పైరసీని ఎట్టి పరిస్థితుల్లో చూడొద్దని పిలుపునిస్తోన్న మోహన్‌బాబు, తెరపై థియేటర్‌లో సినిమా చూస్తే లభించే కిక్ మొబైల్ ఫోన్లలోనో, కంప్యూటర్లలోనో దొరకదని స్పష్టం చేశారు. ఏదేమైనా 'గాయత్రి' సినిమా విషయంలో మోహన్‌బాబుకి ఆయన కుమారులు మనోజ్, విష్ణు చెరోవైపు అన్నట్లుగా సహకరించారన్నమాట. ఒకరేమో తెరపైనే సహకరిస్తే, ఇంకొకరు తెరవెనుకాల సహకరించారన్నమాట. అలా మంచు మల్టీస్టారర్ అయిన 'గాయత్రి' ప్రేక్షకుల్ని ఎలా అలరిస్తుందో వేచి చూడాలిక.