ఓ సూపర్ హిట్, క్లాసిక్, బ్లాక్‌బస్టర్ సినిమా వచ్చిందంటే.. ఆనందమే! కానీ ఆ ఎఫెక్ట్ చాలా కాలం పాటు ఉండిపోతుంది. దర్శకులు అలాంటి సినిమానే తీయాలని, హీరోలు ఆ తరహా కథలే కావాలని పట్టుపట్టుకూని కూర్చుంటారు. దాంతో ఆ సూపర్ హిట్ వెంట.. డిజాస్టర్లు కూడా పుట్టుకొచ్చేస్తుంటాయి. మగధీరతో ప్రభావితమై శక్తి, బద్రీనాథ్‌లు వచ్చాయి. వాటి ఫలితాలు తెలిసిందే. ఈరోజుల్లో అనే చిన్న సినిమా... టాలీవుడ్ కి ఎంత బూస్టప్ ఇచ్చిందో. అయితే ఆ తరవాత 5డీ కెమెరాలతో తీసిన సినిమాలు వందలు వచ్చాయి. కానీ ఒక్కటీ హిట్ అవ్వలేదు. ప్రేమకథా చిత్రం ఇచ్చిన స్ఫూర్తితో కనీసం 40 -50 హారర్ సినిమాలొచ్చుంటాయి. కానీ.. ఒక్కటీ ఆడలేదు. అర్జున్ రెడ్డి ప్రభావం ఇప్పటికీ కొన్ని సినిమాలపై ఉంది. కానీ హిట్టే పడలేదు.
కేజీఎఫ్ కూడా అదే చేస్తోంది. ఈ సినిమా ఎఫెక్ట్ ఇప్పుడు భారతీయ సినిమాలపై గట్టిగా పడింది. కేజీఎఫ్ స్టైల్ లో హీరోయిజం, ఆ ఎడిటింగ్ పేట్రన్, స్క్రీన్ ప్లే... ఆ కలరింగ్ ఇలా అన్నిట్లోనూ కేజీఎఫ్‌ని ఫాలో అవుతూ కొన్ని సినిమాలు తీస్తున్నారు. మొన్నామధ్య సందీప్ కిషన్ సినిమా `మైఖేల్`పై కేజీఎఫ్ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు ఉపేంద్ర చేసిన కబ్జా దీ అదే కథ. ఉపేంద్ర కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందించిన చిత్రమిది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలి రోజు తొలి ఆటకే డిజాస్టర్ టాక్ మూటగట్టుకొంది. పైగా.. కేజీఎఫ్‌కి జిరాక్స్ కాపీలా ఉందని విశ్లేషకులు తేల్చేశారు. కేజీఎఫ్ లాంటి సినిమా తీయాలన్న ఆశతో అచ్చంగా ఆ సినిమాని ఫాలో అయ్యారని, కేజీఎఫ్‌కి అత్యంత చీప్ వెర్షన్ ఇదే అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేజీఎఫ్ లాంటి సినిమా తీయాలనుకోవడం, అంతటి హిట్ కొట్టాలనుకోవడం తప్పేం కాదు. కానీ... దాన్నే ఫాలో అవుతూ పేరడీ లాంటి సినిమాలు తీయడంలో అర్థం లేదు. కబ్జఒక్కటే కాదు.. కన్నడలో కొన్ని సినిమాలు ఇప్పుడు కేజీఎఫ్ లానే ముస్తాబవుతున్నాయట. వాటి భవిష్యత్తు కూడా ఇలానే ఉండబోతోందని కన్నడ చిత్రసీమ ఇప్పుడు భయపడుతోంది.