చిత్రసీమలో ప్రస్తుతం ఎప్పుడూ లేనంత స్థబ్దత అలుముకుంది. లాక్ డౌన్ దృష్ట్యా... థియేటర్లు మార్చిలోనే మూతబడ్డాయి. ఇప్పుడు పరిస్థితులు చక్కబడుతున్నా - థియేటర్లు తెరచుకునే అవకాశాలే కనిపించడం లేదు. నిర్మాతలంతా వేచి చూసే ధోరణిలో పడ్డారు. తెలంగాణలో థియేటర్లు తెరచుకోవచ్చని ప్రభుత్వం ఏనాడో చెప్పింది. కానీ... నిర్మాతలు మాత్రం సినిమాల్ని విడుదల చేసే సాహసం చేయకపోవడంతో కొత్త సినిమాల రాక అనుమానంగా మారింది. థియేటర్లు తెరచుకున్నా జనాలు వస్తారో రారో అన్న భయం.. నిర్మాతల్ని వెంటాడుతోంది. మరోవైపు ఏపీలో థియేటర్ల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
``ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ పరిస్థితులు చక్కబడిన తరవాతే.. థియేటర్లు తెరచుకుంటాయి. అయితే.. ప్రేక్షకుల్లో సినిమాలు చూడాలన్న ఉత్సాహం ఉందో, లేదో తెలుసుకోవడానికి సమయం పడుతుంది. అందుకే...థియేటర్లు తెరచుకున్నా సినిమాలు రావడానికి సమయం పడుతుంది. ఆగస్టులోనే కొత్త సినిమాలు రావొచ్చు. అప్పటి వరకూ ఎదురు చూడక తప్పదు`` అని ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు చెబుతున్నారు. విరాటపర్వం, టక్ జగదీష్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాలు ఎప్పుడో సిద్ధమయ్యాయి. కానీ... లాక్ డౌన్ వల్ల విడుదల కాలేకపోయాయి. అయితే ఇప్పుడు థియేటర్లు తెరచుకున్నా, సినిమాలొచ్చే పరిస్థితి లేదని టాక్. నిర్మాతలంతా ఇంకొంత కాలం ఎదురు చూసి, అప్పుడు నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. సినిమాల సందడి లేనప్పుడు థియేటర్లు తెరచినా ప్రయోజనం లేదు. అందుకే ఇప్పుడిప్పుడే థియేటర్లకు తాళాలు తెరచుకునే అవకాశాలూ కనిపించడం లేదు.