టాలీవుడ్లో డ్రగ్స్ కలకలానికి సంబంధించి, ఈ రోజు నుండి సిట్ ఎదుట విచారణ జరగనుంది. ఇప్పటికీ దీనికి సంబంధించి టాలీవుడ్లో పలువురు సెలబ్రిటీస్‌కి ఎక్సైజ్ శాఖ నోటీసులు అందించింది. నోటీసులు అందుకున్న వారిలో మొదటగా విచారణలో పాల్గొనే అవకాశం డైరెక్టర్ పూరీ జగన్నాధ్‌కి వచ్చింది. ఈ రోజు పూరీ సిట్ అధికారుల ఎదుట విచారణలో పాల్గొనేందుకు హాజరయ్యారు. మరి కొద్ది సేపట్లో పూరీని విచారించనున్నారు. రేపు విచారణకు హీరోయిన్ ఛార్మి హాజరు కావాల్సి ఉంగా, ఎల్లుండి ఐటెం గాళ్ ముమైత్ ఖాన్ రావాల్సి ఉంది. అయితే ముమైత్ ఖాన్ విషయంలో ఓ సస్పెన్స్ ఉంది. ఆమె ప్రస్తుతం బుల్లితెర 'బిగ్ బాస్' షోలో పార్టిసిపెంట్‌గా ఉంది. ఈ షోలో పార్టిసిపేట్ చేసే వాళ్లు 70 రోజుల వరకూ హౌస్ నుండి బయటికి వచ్చే అవకాశం లేదు. మరి ఈ తరుణంలో సిట్ విచారణకు ముమైత్ ఎలా హాజరవుతుంది అనే విషయంపై సందిగ్ధత నెలకొంది. యంగ్ హీరోలు తనీష్, నందు, క్యారెక్టర్ నటుడు సుబ్బరాజు కూడా ఈ విచారణలో పాల్గొననున్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతున్న పూరీని 'మీరు డ్రగ్స్ ఎప్పుడు నుండి తీసుకుంటున్నారు? డ్రగ్స్ డీలర్ కెల్విన్‌తో మీకు ఎప్పటి నుండి పరిచయం..? ఎంత మోతాదులో రోజుకి మీరు డ్రగ్స్ తీసుకుంటారు? మీ నుండి డ్రగ్స్ ఏ ఏ హీరోలకు పంపిణీ చేస్తారు? కెల్విన్కీ మీకూ ఉన్న సంబంధం ఏంటి..? ఇలాంటి తదితర క్వశ్చన్స్ సిట్ అధికారుల నుండి రానున్నాయని మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విచారణ తర్వాత టాలీవుడ్లో పరిణామాలు ఏ రకంగా ఉంటాయనేది తెలియాల్సి ఉంది.