నటీనటులు : శ్రీకాంత్ అయ్యంగార్, గాయత్రీ భార్గవి, సాహితీ, గిరిధర్ దితరులు
దర్శకత్వం : ఆనంద్ చంద్ర
నిర్మాతలు : నట్టి కరుణ, నట్టి క్రాంతి
సంగీతం : డిఎస్ఆర్
సినిమాటోగ్రఫర్ : జగదీష్ చీకటి
ఎడిటర్: శ్రీకాంత్ పట్నాయక్ ఆర్
రేటింగ్: 2.5/5
హిట్లూ, ఫ్లాపులూ, వివాదాలూ రామ్ గోపాల్ వర్మని భయపెట్టలేకపోయాయి. ఇక కరోనా ఎంత? అందుకే లాక్‌డౌన్ సమయంలోనూ సినిమాలు తీసి... ఆశ్చర్యపరిచాడు రాంగోపాల్ వర్మ. అవి ఎంత వరకూ ఆడాయి? అన్నది పక్కన పెడితే, తక్కువ సమయంలో, తక్కువ పెట్టుబడితో సినిమాలు ఎలా తీయాలి? అనే విషయాన్ని వర్మ చూపించగలిగాడు. `మర్డర్` కూడా అంతే. ఈ సినిమాపై ముందు నుంచీ చాలా వివాదాలున్నాయి. వాటిని దాటుకుంటూ వచ్చి - సినిమాని విడుదల చేయగలిగాడు. మరి ఈ మర్డర్ ఎలా సాగింది? రిలీజ్ అయ్యాక కూడా వివాదాలు కొనసాగుతాయా? లేదంటే... అవన్నీ వర్మ పబ్లిసిటీ ట్రిక్కులా? తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాలి.
* కథ
మాధవరావు (శ్రీకాంత్ అయ్యంగార్) కి తన కూతురు నమ్రత (సాహితీ) అంటే ప్రేమ. చాలా అపురూపంగా చూసుకుంటాడు. కోరిందల్లా కొని ఇస్తాడు. తన కూతురికి ఓ గొప్ప సంబంధం చూసి, పెళ్లి చేయాలని, ఆ పెళ్లి గురించి లోకమంతా గొప్పగా చెప్పుకోవాలని కలలుకంటాడు. అయితే నమ్రత తన కాలేజీలో చదువుకుంటున్న ప్రవీణ్ అనే అబ్బాయిని ప్రేమిస్తుంది. ప్రవీణ్‌ది నిజమైన ప్రేమ కాదని, కేవలం తన ఆస్తి కోసం ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నాడన్న విషయం మాధవరావుకి అర్థం అవుతుంది. అందుకే వీరి ప్రేమని కాదంటాడు.
కూతురి మనసు మార్చడానికి శతవిధాలా ప్రయత్నిస్తాడు. కానీ నమ్రత ప్రేమ మత్తులో ఇవేం పట్టించుకోదు. తండ్రినికాదని, ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంది. కూతురి కులాంతర వివాహం మాధవరావుని కలచి వేస్తుంది. ఎలాగైనా తన కూతుర్ని తన దగ్గరకు తెచ్చుకోవాలని విశ్వ ప్రయత్నాలూ చేస్తాడు. చివరికి ప్రవీణ్‌ని హత్య చేయాలని పథకం వేస్తాడు. ఆ తరవాత ఏమైంది? కూతురి ప్రేమ మత్తులో ఆ తండ్రి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? అనేదే మిగిలిన కథ.
* విశ్లేషణ
మిర్యాల గూడలో జరిగిన ఓ యదార్థ గాథని.. వర్మ కథా వస్తువుగా మార్చుకున్నాడన్న విషయం.. ముందు
నుంచీ అర్థమవుతూనే ఉంది. పాత్రల పేర్లు కూడా దాదాపుగా అలానే వినిపిస్తాయి కూడా. `ఈ కథ ఎవరినీ ఉద్దేశించి కాదు` అని చెబుతున్నా - ప్రేక్షకులు మిర్యాల గూడ పరువు హత్య ఎపిసోడ్ తో కనెక్ట్ అవుతారు. తండ్రీ కూతుర్ల అనుబంధం, ఆ తరవాత. కూతురి ప్రేమ ఎపిసోడ్, తన కూతురికి తండ్రి నచ్చజెప్పే ప్రయత్నాలు.. ఇలా సన్నివేశాలన్నీ ఓ టెంపోలో సాగుతాయి. కన్న కూతురి కోసం ఓ తండ్రి పడే ఆవేదన ఈ సినిమా అనుకోవొచ్చు. ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కూతురు.. ప్రేమ పేరుతో మోసపోయి, ఎవరినో పెళ్లి చేసుకుని వెళ్లిపోతే, ఆ తండ్రి ఎంత మానసిక వేదన అనుభవిస్తాడో.. చూపించే ప్రయత్నం చేశారు. పరువు హత్యకు ఎలాంటి అంశాలు ప్రేరేపిస్తాయో.. తెరపై ఆవిష్కరించారు.
ఈ సినిమా చూస్తున్నప్పుడు వర్మ... తండ్రి పాత్రవైపే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నట్టు కనిపించింది. కొన్ని సందర్భాల్లో కూతుర్ని విలన్ గా చూపించాడేమో అనిపిస్తుంది. మర్డర్ ప్లానింగ్, దాన్ని అమలు చేసే తీరు.. ఇవన్నీ ఉత్కంఠతని రేకెత్తిస్తాయి. కొన్ని సన్నివేశాలు థ్రిల్లింగ్‌గానూ అనిపిస్తాయి. వర్మ శిష్యుడు ఆనంద్ చంద్ర... ప్రతి ఫ్రేములోనూ గురువుని గుర్తు చేసేశా సన్నివేశాల్ని నడిపాడు. రెండు మూడు పాత్రల మధ్య నడిచే కథ ఇది. ఎమోషన్ ని బాగానే పట్టుకున్నా - కొన్ని సన్నివేశాలు సీరియల్ ధోరణిలో సాగుతాయి. రిపీటెడ్ సీన్లు తెరపై ఉన్న ఫీలింగ్ వస్తుంది.
నిజానికి ఇలాంటి పరువు హత్యల కథనాలు వినడం, చదవడం, టీవీల్లో చూడడం ప్రేక్షకులకు కొత్త కాదు. కాబట్టి - వాళ్లకూ రొటీన్ స్టోరీగానే అనిపిస్తుంది. మిర్యాల గుడ ఎపిసోడ్ తరవాత.. అమ్మాయి తరపున మాట్లాడినవాళ్లకు ఈ కథ, కథనాలు మింగుడు పడకపోవొచ్చు. ఆ ఎపిసోడ్ లో తండ్రి చేసిందేం తప్పు కాదు అనుకున్నవాళ్లకు నచ్చొచ్చు. ఆల్రెడీ ఈ ఎపిసోడ్ ని టీవీ చానళ్లు అరగొట్టి అరగ్గొట్టి వదిలాయి కదా.. అనుకుంటే మాత్రం... నిరభ్యంతరంగా ఈ సినిమాని పక్కన పెట్టొచ్చు.
* నటీనటులు
శ్రీకాంత్ అయ్యంగార్.. వర్మ కాంపౌండ్ లో తరచూ కనిపించే నటుడు. మరోసారి తన సహజసిద్ధమైన నటనతో అలరించాడు. తన పాత్రకు నూటికి నూరుపాళ్లూ న్యాయం చేశాడు. కూతురు దూరం అవుతున్న బాధలో, ఒకరి చేతుల్లో మోసపోతోందన్న ఆవేదనలో శ్రీకాంత్ నటన చక్కగా వుంది. సాహితికి ఇది తొలి సినిమా. కానీ ఆ అనుభవలేమి కనిపించనివ్వలేదు. శ్రీకాంత్ కి ధీటుగా నటించింది. ఖయ్యుమ్ ఓ పాత్రలో కనిపించాడు. మిగిలిన వాళ్లకు అంత స్కోప్ లేదు.
* సాంకేతిక వర్గం
కెమెరా, నేపథ్య సంగీతం.. ఇవన్నీ పర్‌ఫెక్ట్ గా కుదిరాయి. వర్మ గత సినిమాల ఛాయలు, ఆ కెమెరా ఫ్రేమింగులూ మళ్లీ కనిపించాయి. ఇలాంటి కథలు ఎంచుకున్నప్పుడు ఇంత కంటే ఏం చెప్పలేం. ఎవరో ఒకరి తరపున వకాల్తా పుచ్చుకోవాలి. ఈ కథలో తండ్రి పాత్రపై రవ్వంత ఎక్కువ ప్రేమని చూపించాడు దర్శకుడు. కొన్ని సన్నివేశాలు రోమాంఛితంగా సాగుతాయి. ఇంకొన్ని చోట్ల బోర్ కొట్టిస్తాడు.
* ప్లస్ పాయింట్స్
వాస్తవ ఘటన నేపథ్యంలో తెరకెక్కడం
శ్రీకాంత్ అయ్యంగార్ నటన
* మైనస్ పాయింట్స్
బోరింగ్ సీన్లు
* ఫైనల్ వర్డిక్ట్: మరో పరువు హత్య