చరిత్రలో ఎవరూ సాధించలేని ఘనత మైత్రీ మూవీస్ దక్కించుకొంది. ఓ సంక్రాంతి సీజన్‌లో విడుదలైన రెండు సినిమాల్ని నిర్మించడం, ఒక రోజు వ్యవధిలో విడుదల చేయడం మామూలు విషయం కాదు. అందుకు చాలా గట్స్ కావాలి. సంక్రాంతికి విడుదలైన వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి చిత్రాల్లో.. దేన్నీ తక్కువ చేయకుండా భారీగా ప్రమోషన్లు ఇచ్చుకొంటూ, ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
రెండూ దాదాపు ఒకేరకమైన ఫలితాన్ని అందుకొన్నాయి. అంత వరకూ బాగానే ఉంది. ఇప్పుడు అసలు సమస్య వచ్చింది. ఈ రెండు సినిమాల కలక్షన్ల మాటేంటి? ఎంతొచ్చాయి? ఏ ఏరియాలో ఎంత వసూలు చేసింది..? ఈ లెక్కలేవీ బయటకు చెప్పడం లేదు. తొలి రోజు ఈ రెండు సినిమాలకూ రూ.54 కోట్లు వచ్చాయని మైత్రీ ప్రకటించింది. ఆ తరవాత ఏమైందో.. లెక్కలు చెప్పడం మానేసింది. మా సినిమాకి ఎంతొచ్చింది? అంటూ ఆయా హీరోల అభిమానులు మైత్రీ మూవీస్ పై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. కానీ ఆ లెక్కలు చెపన్పడానికి మైత్రీ ఇష్ట పడడం లేదు. ఎందుకంటే.. కచ్చితంగా ఓ సినిమాకి ఎక్కువ, ఓ సినిమాకి తక్కువ ఉంటాయి. అలాంటప్పుడు.. ఫ్యాన్స్ మధ్య గొడవలు ప్రారంభం అవుతాయి. పైగా హీరోలకు అంకెలు చెప్పి... వాళ్లని సంతృప్తి పరచడం కూడా అంత తేలికైన విషయం కాదు. అందుకే తొలి రోజు వసూళ్లని ప్రకటించిన మైత్రీ ఆ తరవాత గప్ చుప్ అయిపోయింది.
ఒక వేళ చెప్పినా రెండు సినిమాలకూ పెద్దగా మార్జిన్ లేకుండానే అంకెల్ని ప్రకటించే అవకాశం ఉంది. నిజమైన లెక్కలెప్పుడూ బయటకు రావు. అలాంటప్పుడు... వసూళ్ల గొడవలో తల దూర్చడం ఎందుకని మైత్రీ సైలెంట్ అయిపోయి ఉంటుంది.