మూడు రోజుల్లోనే 83 కోట్లకు పైగా వసూళ్ళు (గ్రాస్) సాధించింది అల్లు అర్జున్ హీరోగా నటించిన 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ ఈ సినిమాతో తొలిసారిగా దర్శకుడిగా వెండితెరకు పరిచయమైన సంగతి తెల్సిందే. మిలిటరీ నేపథ్యంలో రూపొందిన 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ళ ప్రభంజనమే సృష్టిస్తోంది.
డివైడ్ టాక్‌తో ఈ స్థాయి వసూళ్ళు సినీ పరిశ్రమలోని ప్రముఖుల్నే ఆశ్చర్యపరుస్తున్నాయి. ఓవర్సీస్‌లోనూ 'నా పేరు సూర్య' సత్తా చాటుతుండడానికి కారణం, తెలుగు ఆడియన్స్‌తోపాటు, అల్లు అర్జున్‌కి మలయాళంలోనూ వున్న అభిమానులే కారణమని వేరే చెప్పాల్సిన పనిలేదు. సినిమాలోని భావోద్వేగాలు, యాక్షన్ ఎలిమెంట్స్, అన్నిటికీ మించి మిలిటరీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలు, వీటికి తోడు అల్లు అర్జున్ డాన్సులు సినిమా ఈ స్థాయి విజయాన్ని సాధించడంలో కీలక భూమిక పోషించాయని చెప్పొచ్చు. అనూ ఇమ్మాన్యుయేల్ గ్లామర్ ఈ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ.
కేవలం మూడు రోజుల్లోనే 83 కోట్లకు పైగా కొల్లగొట్టిన 'నా పేరు సూర్య' ఈ రోజు, నాలుగో రోజున 100 కోట్ల మార్క్ అందుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే సోమవారం ఏ సినిమాకి అయినా అగ్ని పరీక్షే గనుక, ఆ పరీక్షలో అల్లు అర్జున్ నెగ్గుతాడా? లేదా? అనేది చూడాల్సి వుంటుంది. ఓవరాల్‌గా ఈ సినిమా షేర్స్ పరంగా కూడా 100 కోట్లు దాటేయొచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే, అల్లు అర్జున్‌కి ఆ మార్క్ అందించిన తొలి సినిమా 'నా పేరు సూర్య' అవుతుంది.