చిత్రం: నా సామిరంగ
నటీనటులు: నాగార్జున, అల్లరి నరేష్, ఆషికా రంగనాథ్, రాజ్ తరుణ్
దర్శకత్వం: విజయ్ బిన్ని
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
ఛాయాగ్రహణం: శివేంద్ర దాశరధి
కూర్పు: చోటా కె. ప్రసాద్
బ్యానర్స్: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్
విడుదల తేదీ: 14 జనవరి 2024
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 2.75/5
నాగార్జున సంక్రాంతి హీరో. ఆయనకు ఈ సీజన్ భలే కలిసొస్తుంది. ఈ పండక్కి కూడా ఆయన నుంచి ఒక సినిమా వచ్చింది. అదే .. నా సామిరంగ. ఈ సినిమాని కేవలం సంక్రాంతి కోసమే అన్నట్టుగా రెడీ చేశారు. మూడు నెలల్లో షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి ప్రేక్షకుల ముందు తెచ్చేశారు. మరి ఇంత పండగ స్పెషల్ ఇందులో ఏముంది? నా సామిరంగ నిజంగా పండగ వినోదాలని పంచిందా?
కథ: 60-80మధ్య కాలంలో కోనసీమ నేపధ్యంలో సాగే కథ ఇది. కిష్టయ్య (నాగార్జున) అంజి (అల్లరి నరేశ్) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ఒకతల్లి కడుపున పుట్టకపోయినా అన్నదమ్ముల్లానే వుంటారు. కిష్టయ్య 12ఏళ్ల వయసులోనే ఆ ఊరి వడ్డీ వ్యాపారి వరదరాజులు (రావు రమేశ్) కూతురు వరాలు (ఆషికా రంగనాథ్)తో ప్రేమలో పడతాడు. కాలం గడుస్తుంది. పెద్దయ్యాక ఒకరి ప్రేమని ఒకరు చెప్పుకొని పెళ్లి సిద్ధం అవుతుండగా ఒక అనూహ్య ఘటన వాళ్ళ పెళ్లికి అడ్డుగా మారుతుంది. తర్వాత ఏం జరిగింది ? ఇద్దరూ కలిశారా? కథలో భాస్కర్ (రాజ్‌తరుణ్), కుమారి (రుక్సార్) పెద్దయ్య( నాజర్) మంగ( మిర్నా మీనన్) పాత్రల ప్రాధాన్యత ఏమిటి ? స్నేహం, ప్రేమ, పగ నేపధ్యంలో సాగిన ఈ కథ ఏ తీరాలకు చేరిందనేది తెరపై చూడాలి.
విశ్లేషణ: రిమేక్ సినిమా చేయడం ఒక ఆర్ట్. ఈ విషయంలో నాగార్జున నా సామిరంగ దర్శకుడు విజయ్ బిన్నీకి మంచి మార్కులు పడతాయి. ‘ పోరింజు మరియం జోష్’ అనే మలయాళం సినిమాకి రిమేక్ ఇది. అయితే ఎక్కడా రిమేక్ ఛాయలు లేకుండా చక్కగా తెలుగీకరించారు. మలయాళం సినిమా చర్చి వేడుక నేపధ్యంలో సాగితే.. ఇక్కడ దాన్ని సంక్రాంతి పండగగా మార్చారు. ఈ మార్పు చాలా చక్కగా కుదిరింది. నాగ్ ,అల్లరి నరేష్ పాత్రల మధ్య స్నేహాన్ని చూపిస్తూ ఫీల్ గుడ్ గా కథని మొదలుపెట్టారు. వారి మధ్య మంచి బాండింగ్ కుదిరింది. మరో వైపు నాగార్జున ఆషిక ప్రేమకథ కూడా వింటేజ్ లవ్ స్టొరీని గుర్తు చేస్తూ సరదగా సాగుతుంది. వయసుకు తగ్గట్టు ఆ ప్రేమకథని మెచ్యూర్ గా డీల్ చేశారు.
దాసు పాత్ర పరిచయంతో ఈ కథలో అసలైన ఘర్షణ తెరపైకి వస్తుంది. ఎంటర్వెల్ సీక్వెన్స్ ఆసక్తికరంగానే వుంటుంది. విరామం తర్వాత వచ్చే సన్నివేశాలు కూడా బోర్ కొట్టించకుండా సాగిపోతాయి. ప్రభల తీర్ధం ఎపిసోడ్ తో మరింత నేటివిటీ యాడ్ అయ్యింది. ముగింపు కోసం అంజి పాత్రని వాడుకున్న విధానం ఒక ఎమోషన్ ని తీసుకొచ్చింది. అది వర్క్ అవుట్ అయ్యింది. అయితే దాసు పాత్ర రూపంలో ఇందులో హింస కాస్త ఎక్కువైయింది. ఆ పాత్రని కాస్త తెలుగైజ్ చేసివుంటే బావుండేది.
నటీనటులు: పల్లెటూరి పాత్రలు చేయడం లో నాగార్జున దిట్ట. కిష్టయ్య పాత్రని చాలా సహజంగా సునాయాసంగా చేసుకుంటూ వెళ్ళారు. ఆయన లుక్, స్టయిల్, మాస్ వైబ్ బావుంది. ఇందులో చైన్ లాగే సన్నివేశం భలే కుదిరింది. అంజి పాత్రలో నరేశ్ ఒదిగిపోయాడు. అంజి పాత్ర ఈ చిత్రానికి మరో ఆకర్షణ. వరాలుగా ఆషికా అందంగా కనిపించింది. నటనకు ఆస్కారం వుండే పాత్ర చేసింది. షబ్బీర్ విలనిజం కాస్త శ్రుతి మించినట్లు అనిపించింది. నాజర్, రాజ్‌తరుణ్, మిర్నా, రుక్సార్ తదితరుల పాత్రలు పరిధి మేరకు వున్నాయి.
టెక్నికల్:
కీరవాణి పాటలు, నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణ. శివేంద్ర ఛాయాగ్రహణం బావుంది, విజువల్స్ ఆహ్లాదకరంగా వున్నాయి. దర్శకుడు విజయ్ సినిమాలోని ఎమోషన్ మిస్ కాకుండా ఇంత మంది నటీనటులని తెరపై చూపించడంలో పై చేయి సాధించాడు. పాటల్లో తన మార్క్ చూపించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. తక్కువ సమయంలోనే చాలా క్యాలిటీ అవుట్ పుట్ ఇచ్చారు.
ప్లస్ పాయింట్స్
కథ, కథనం
నాగార్జున, అల్లరి నరేష్, అషికా
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
కొన్ని చోట్ల రక్తపాతం
అక్కడక్కడ కాస్త సాగదీత
ఫైనల్ వర్డిక్ట్ : నా సామిరంగా.. సంక్రాంతి బొమ్మ...