చిత్రసీమకూ - ఏపీ ప్రభుత్వానికీ మధ్య ఉన్న గ్యాప్ మొత్తం సమసిపోతుంది.. టాలీవుడ్ సమస్యలన్నీ ఓ కొలిక్కి వస్తాయని భావిస్తున్న తరుణంలో నాగబాబు రంగ ప్రవేశం చేశాడు. ఆయన తనదైన శైలిలో ఏపీ ప్రభుత్వంపై, మంత్రులపై, చిత్రసీమపై అనుసరిస్తున్న విధానాలపై నిప్పులు చెరిగారు. పవన్ ని టార్గెట్ చేస్తున్నారని చెబుతూనే, చిత్రసీమ ఎవరికీ తొత్తు కాదని, అధికార దుర్వినియోగం సహించమని, కావాలంటే ఏపీలో సినిమాల్ని బ్యాన్ చేసుకోవాలని, తమకేం నష్టం లేదని - ఇలా రెచ్చిపోయాడు నాగబాబు.
నాగబాబు కోపంలో, బాధలో, ఆవేశంలో అర్థం ఉంది. ఏపీలో భీమ్లా నాయక్ ని అడ్డుకోవడానికి వైకాపా నేతలు పడిన తంటాల్ని జనం చూస్తూనే ఉన్నారు. తమ్ముడి సినిమాని అడ్డుకునేందుకు వైకాపా ఆడిన కుతంత్రాల్ని ఎండగట్టడానికి ఆయన రంగంలోకి దిగాడన్నది కాదనలేని వాస్తవం. కాకపోతే... ఈ వ్యాఖ్యలు ప్రత్యక్షంగా, పరోక్షంగా చిత్రసీమకు డ్యామేజీ కలిగించేలా ఉన్నాయన్నది కొందరి మాట. త్వరలో అంతా సద్దుమణుగుతుంది అనుకుంటున్న తరుణంలో ఇలా నాగబాబు ఎంట్రీ ఇవ్వడం, మళ్లీ ఏపీ మంత్రుల్ని కెలకడం మింగుడు పడని వ్యవహారం. ఓవైపు చిరంజీవి... పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తుంటే, నాగబాబు అడ్డుపుల్ల వేస్తున్నాడన్నది కొందరి మాట. ఓ వ్యవహారంపై సొంత ఇంట్లోనే భిన్న స్వరాలు వినిపించడం నిజంగా ఆశ్చర్యపరిచే విషయమే. ఈ వ్యవహారంలో నాగబాబుని చిరు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాడో అర్థం కావడం లేదు. తొలి వీడియో విడుదల చేసిన తరవాతే చిరు రంగంలోకి దిగాల్సింది. నాగబాబుని అదుపులో పెట్టాల్సింది. అది జరగలేదు. వెంటనే రెండో వీడియో వచ్చేసింది. ఇందులో నేరుగా వైకాపా మంత్రుల్ని టార్గెట్ చేసి, నాగబాబు స్పీచ్ దంచి కొట్టారు. `కావాలంటే సినిమాల్ని బ్యాన్ చేసుకోండి. మేం ఓటీటీలో విడుదల చేసుకుంటాం` అని స్టేట్‌మెంట్ ఇచ్చేశాడు. ఇలాంటి వ్యాఖ్యలు పరిస్థితిని వెనక్కి నెట్టేవే.
నాగబాబు ముందు నుంచీ పవన్ పక్షం. పవన్ ఏమంటే.. తను అదే అంటాడు. చిరు అంటే నాగబాబుకి మర్యాదే. కాకపోతే... చిరునా, పవనా? అనే ప్రశ్న ఎదురైతే పవన్ పక్షాన ఉండే వ్యక్తి నాగబాబు. అందుకే.. చిరు సైతం.. నాగబాబుని కంట్రోల్ చేయలేకపోతున్నాడన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. రెండో వీడియో విడుదల చేసిన తరవాత చిరు నాగబాబుతో మాట్లాడాడని, ఈ విషయంలో కాస్త సంయమనం పాటించాలని నాగబాబుకి హితవు పలికాడన్నది టాక్. మరి.. నాగబాబు కంట్రోల్ అవుతాడా? లేదంటే.. తమ్ముడి కోసం మళ్లీ ఇలాంటి ఘాటైన విమర్శలే చేస్తాడా? అనేది చూడాలి.