`మా` రిజల్ట్ రాగానే - మెగా బ్రదర్ నాగబాబు తన `మా` సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఓరకంగా.. మెగా ఫ్యాన్స్‌కి ఇది షాక్ నిచ్చిన విషయం.ఈ ఎన్నికలలో నాగబాబు ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ ఓటమికి నాగబాబు నైతిక బాధ్యత వహిస్తూ తప్పుకుని ఉండొచ్చన్నది అందరి మాట. కాకపోతే.... ఇందులో చాలా కోణాలున్నాయి.
లోకల్ - నాన్ లోకల్ గొడవ `మా` ఎన్నికలలో గట్టిగా నడిచింది. ఈ వ్యవహార శైలి నచ్చకపోవడం వల్లే. మా నుంచి వెళ్లిపోతున్నానని నాగబాబు ప్రకటించారు. ఓరకంగా అది కోపమే. తాను ప్రచారం చేసినా, మా సభ్యులు ప్రకాష్ రాజ్ ని గెలిపించలేదు. దాంతో ఓరకంగా ఇది అలక కూడా. ప్రకాష్ రాజ్ కి మద్దతు ఇచ్చే క్రమంలో నాగబాబు కొన్ని షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా కోట శ్రీనివాసరావుపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కోట లాంటి సీనియర్ నటుడి పట్ల నాగబాబు ప్రవర్తించిన విధానం చర్చనీయాంశమైంది. మెగా కుటుంబాన్ని అభిమానించేవాళ్లు సైతం నాగబాబు వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. నాగబాబు క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్ వినిపించింది. ఓరకంగా చూస్తే... ఇది తాను చేసిన తప్పు శిక్ష అని కూడా అనుకోవొచ్చు. గత ఎన్నికలలో నరేష్ కి మద్దతు ఇచ్చారు నాగబాబు. ఆ ఎన్నికలలో నరేష్ గెలిచాడు. అప్పుడు నాగబాబు మంత్రం పనిచేసింది. ఈసారి మాత్రం అది పనికిరాలేదు. అందుకే రాజీనామా చేసి, తప్పుకున్నాడు నాగబాబు.